పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ముంబై మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఇటీవల మమతా ముంబై వచ్చిన సమయంలో జాతీయ గీతాన్ని అవమానపరిచారనే ఆరోపణలపై దాఖలైన కేసులో మార్చి 2న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. కాగా డిసెంబరు 1, 2021న ముంబైలో ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ నిర్వహించిన ఓ కార్యక్రమానికి సీఎం మమతా బెనర్జీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అయితే ఈ కార్యక్రమంలో మమతా బెనర్జీ జాతీయ గీతాన్ని అవమానించారని మహారాష్ట్రకు చెందిన బీజేపీ కార్యకర్త, న్యాయవాది వివేకానంద గుప్తా ఆరోపించారు. ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని మెజిస్ట్రేట్ కోర్టును కోరారు.
ముంబైలో ఈకార్యక్రమానికి హాజరైన బెనర్జీ జాతీయ గీతంలోని మొదటి రెండు పద్యాలను కూర్చొని ఆలపించారని, ఆ తర్వాత నిలబడి మరో రెండు శ్లోకాలు పఠించారని, ఆ తర్వాత అకస్మాత్తుగా ఆగిపోయారని కోర్టుకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే మమతా బెనర్జీ జాతీయగీతాన్ని ఆలపించి, ఆ తర్వాత వేదికపై నుంచి వెళ్లిపోయినట్లు ఫిర్యాదుదారుడి వాంగ్మూలం, వీడియో క్లిప్,యూట్యూబ్‌లోని వీడియోల ద్వారా ప్రాథమికంగా స్పష్టంగా తెలుస్తోందని కోర్టు పేర్కొంది. జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టం, 1971లోని సెక్షన్ 3 ప్రకారం మమతా శిక్షార్హమైన నేరానికి పాల్పడ్డాడని ఈ ప్రాథమిక విచారణ రుజువు చేస్తుందని తెలిపింది.