ఓ రైతు పొలంలోని బావి అకస్మాత్తుగా అదృశ్యమైందని, వెతికి పెట్టాలని కోరుతూ ఓ రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కర్ణాటకలోని బెళగావి జిల్లా మావినహొండలో జరిగిందీ ఘటన. తన బావి కనిపించడం లేదంటూ స్థానిక రైతు మల్లప్ప ఇచ్చిన ఫిర్యాదుతో తొలుత విస్తుపోయిన పోలీసులు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
మల్లప్ప పొలంలో బావిని తవ్వినట్టు పంచాయతీ అధికారులు రికార్డులు సృష్టించి, ప్రభుత్వ నిధులు కాజేశారు. అంతేకాక, బావి తవ్వించినందుకు తీసుకున్న రుణం తిరిగి చెల్లించాలంటూ రైతుకు నోటీసులు కూడా పంపారు. దీంతో విస్తుపోయిన రైతు పోలీసులను ఆశ్రయించడంతో అధికారుల బాగోతం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.