నరేంద్ర మోదీకి దేశంలోని పన్నెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడిగా లేఖ రాశాయి. కరోనా కట్టడికి సంబంధించి పలు సూచనలు చేశాయి. మహమ్మారి నేపథ్యంలో నెలకొన్న సంక్షోభాన్ని మానవ విషాదంగా పేర్కొన్న పార్టీలు.. ఉచిత వ్యాక్సిన్లు, సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిలిపివేత వంటి పలు కీలక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాయి.ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు కూడా చేశాయి. గతంలోనే పలు పార్టీలు చేసిన విన్నపాల్ని ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ఆరోపించాయి. ఈ వైఖరే మానవ విషాదానికి దారి తీసిందని వ్యాఖ్యానించాయి.
లేఖలో పేర్కొన్న సూచనలివే…
- అందుబాటులో ఉన్న అన్ని వనరుల నుంచి వ్యాక్సిన్లను సమకూర్చుకోవాలి
- వెంటనే ఉచిత, సార్వత్రిక వ్యాక్సినేషన్ క్యాంపెయిన్‌ను నిర్వహించాలి
- టీకా ఉత్పత్తిని పెంచేందుకు తప్పనిసరి లైసెన్సింగ్ విధానాన్ని తీసుకురావాలి
- వ్యాక్సిన్ల కోసం బడ్జెట్‌లో కేటాయించిన రూ.35 వేల కోట్లను వెంటనే ఖర్చు చేయాలి
- సెంట్రల్ విస్టా నిర్మాణాన్ని నిలిపివేసి ఆ నిధులను ఆక్సిజన్, వ్యాక్సిన్ల కోసం ఉపయోగించాలి
- పీఎం కేర్స్ నిధులను వ్యాక్సిన్లు, ఆక్సిజన్, వైద్య సామగ్రి కొనుగోలు చేసేందుకు కేటాయించాలి
- నిరుద్యోగులకు నెలకు రూ.6000 చొప్పున అందించాలి
- అర్హులకు ఉచితంగా ఆహారధాన్యాలు పంపిణీ చేయాలి
- సాగు చట్టాల్ని రద్దు చేసి ఆందోళన చేస్తున్న రైతుల్ని కొవిడ్ నుంచి రక్షించాలి