contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల వివరాలు – లక్షల్లో నమోదైన మరణాలు

డిసెంబరులో చైనాలో ఉద్భవించిన కరోనా రక్కసి ప్రపంచవ్యాప్తంగా 195కి పైగా దేశాలను గజగజలాడిస్తోంది. ఇప్పటివరకు కరోనా బారి నుంచి పూర్తిగా తేరుకున్న దేశమంటూ లేదు. అత్యధిక దేశాల్లో వేల సంఖ్యలో మరణాలు చోటుచేసుకోవడం వైరస్ తీవ్రతకు నిదర్శనం. వ్యాక్సిన్ లేకపోవడం, వాతావరణ పరిస్థితులకు అంత తేలిగ్గా లొంగని మొండి వైరస్ కావడంతో దీని వ్యాప్తి అంతకంతకు పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న పరిణామాలు ఇవిగో..!
ప్రపంచవ్యాప్త వివరాలు
ప్రపంచవ్యాప్తంగా 37,10,240 మంది కరోనా బారినపడ్డారు. ఇప్పటివరకు 2,60,546 మంది మరణించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ఏప్రిల్ మాసంలో ప్రతిరోజు సగటున 80 వేల కొత్త కేసులు నమోదయ్యాయి.
భారత్, బంగ్లాదేశ్ వంటి ఆసియా దేశాల్లో కరోనా ఉద్ధృతి పెరుగుతుండగా, తొలినాళ్లలో కరోనా తీవ్రత చవిచూసిన కొన్ని యూరప్ దేశాల్లో వైరస్ ప్రభావం గణనీయంగా తగ్గుతోంది.
ప్రపంచదేశాలన్నింటిలో కరోనా అత్యధిక ప్రభావం చూపుతున్న దేశం అమెరికానే. అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య 12,14,572 కాగా రికార్డు స్థాయిలో 71,982 మంది మరణించారు.
మరణాల సంఖ్యలో అమెరికా తర్వాత బ్రిటన్ (30,076), ఇటలీ (29,684), స్పెయిన్ (25,857), ఫ్రాన్స్ (25,809) ఉన్నాయి.
దక్షిణ కొరియా క్రమేపీ సాధారణ స్థితికి చేరుకుంటోంది. ఉద్యోగులు ఆఫీసులకు వెళుతున్నారు. లైబ్రరీలు, మ్యూజియంలు తెరుచుకున్నాయి.
వుహాన్ లో కొన్ని పాఠశాలల్లో విద్యాబోధన పునఃప్రారంభమైంది. విద్యార్థులు మాస్కులు ధరించి క్లాసులకు హాజరవుతున్నారు.
రెండో ప్రపంచయుద్ధంలో జపాన్ పెర్ల్ హార్బర్ పై దాడి చేసినప్పటికంటే, 2001లో 9/11 దాడుల కంటే కరోనా వైరస్ కారణంగానే అమెరికా తీవ్రంగా నష్టపోయిందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.
జర్మనీలో ప్రఖ్యాత ఫుట్ బాల్ బుండెస్ లిగా పోటీలకు ఆ దేశ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ పచ్చజెండా ఊపారు. మధ్యాహ్నం నుంచి పోటీలు జరుపుకోవచ్చని, ప్రేక్షకుల్లేకుండానే లీగ్ నిర్వహించుకోవాలని మెర్కెల్ స్పష్టం చేశారు.
కెన్యా రాజధాని నైరోబీ శివార్లలో కొంతమేర, రేవు పట్టణం మొంబాసాలో పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించారు. అక్కడ కరోనా కేసులు అమాంతం పెరిగిపోతుండడంతో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. 
దేశవ్యాప్త వివరాలు
కేరళ సహా 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గడచిన 24 గంటల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. దేశంలో కొత్తగా 3,561 కేసులు నమోదు కాగా, 1084 మంది డిశ్చార్జి అయ్యారు.
భారత్ లో కరోనా మరణాల రేటు 3.3 శాతం కాగా, కోలుకుంటున్న వారి శాతం 28.83గా ఉంది.
దేశంలోని వలస కార్మికుల కోసం మే 1 నుంచి ఇప్పటివరకు 163 శ్రామిక్ రైళ్లు నడిపారు. తద్వారా 1.60 లక్షల మందిని స్వస్థలాలకు తరలించారు.
177 మంది ప్రయాణికులతో దుబాయ్ నుంచి ప్రత్యేక విమానం కొచ్చి బయల్దేరింది.
అమెరికా నుంచి భారతీయుల తరలింపు శనివారం నుంచి షురూ కానుంది.
సింగపూర్ నుంచి భారతీయుల తరలింపు శుక్రవారం ప్రారంభమవుతుంది.
రాష్ట్రాల వివరాలు
మహారాష్ట్రలో 487 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ అని తేలింది.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పాన్ మసాలా అమ్మకాలపై నిషేధం ఎత్తివేసింది.
ఏపీలో కొత్తగా 56 కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 1833కి పెరిగింది.
దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన మూడు లక్షల మంది జార్ఖండ్ వాసులు స్వస్థలాలకు వెళ్లేందుకు తమ పేర్లు నమోదు చేయించుకున్నారు.
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :