తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై, టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సంజయ్ కి నాలుక కోస్తామని హెచ్చరించారు. గుడులు, బడులు, ఇండియా, పాకిస్థాన్ అంటూ యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బట్టలు ఊడదీసి కొడతామని అన్నారు. రైతుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుంటే… రైతులను నట్టేట ముంచే చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. ఢిల్లీలో చలికి వణుకుతూ రైతులు ఆందోళన చేస్తుంటే… చర్చల పేరిట కేంద్రం కాలయాపన చేస్తోందని అన్నారు. కేసీఆర్ చేసిన ఉద్యమం వల్లే తెలంగాణ వచ్చిందని… బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడని బాల్క సుమన్ చెప్పారు. కేసీఆర్ పై అసత్య ఆరోపణలు చేస్తున్న బీజేపీ నాయకులపై మహారాష్ట్రలోని శివసేన తరహాలో దాడి చేయాలని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్ గుర్తిస్తున్నారని… కొంత ఆలస్యం అయినా అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు. కేసీఆర్ ని విమర్శిస్తే ఆయన సొంత గడ్డ కరీంనగర్ లోనే బండి సంజయ్ ని బట్టలు ఊడదీసి కొడతామని అన్నారు.