జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు ఘాతుకానికి తెగబడ్డారు. బీజేపీ నేత షేక్ వాసిం బరీ, ఆయన తండ్రి, సోదరుడిని నిన్న రాత్రి కాల్చి చంపారు. బాండిపొరా జిల్లాలో జరిగిందీ ఘటన. స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలోని ఓ దుకాణం బయట వాసిం కుటుంబం కూర్చున్న సమయంలో రాత్రి 9 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన ముగ్గురినీ బాండిపొరా జిల్లా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే వారు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలిసిన ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బీజేపీ నేత వాసిం బరీ, ఆయన తండ్రి బషీర్ అహ్మద్, సోదరుడు ఉమర్ బషీర్‌పై ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారని, ఆసుపత్రికి తరలించేలోగానే వారు ప్రాణాలు కోల్పోయినట్టు జమ్మూకశ్మీర్ పోలీసులు ట్వీట్ చేశారు. కాగా, వాసిం కుటుంబానికి 8 మంది భద్రతా సిబ్బందితో కూడిన రక్షణ ఉంది. అయితే, ఉగ్రవాదులు కాల్పులు జరిపిన సమయంలో ఒక్కరంటే ఒక్కరు కూడా అక్కడ లేకపోవడం గమనార్హం. విధుల్లో నిర్లక్ష్యం వహించిన గార్డులను అరెస్ట్ చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు.
ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని బీజేపీ సీనియర్ నేత రాంమాధవ్ ట్వీట్ చేశారు. బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపారు. వాసిం మరణం పార్టీకి తీరని లోటని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆవేదన వ్యక్తం చేశారు. వాసి మృతికి జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రగాఢ సానుభూతి తెలిపారు.