బ్యాంకు లావాదేవీలకు దూరంగా ఉంటూ… పోస్టాఫీసునే బ్యాంకుగా భావించే కోట్ల మందికి ఇది నిజ్జంగా శుభవార్తే. ఎందుకంటే కొన్నేళ్లుగా ‘పోస్టల్ బ్యాంక్’ మాట వినిపిస్తున్నా బ్యాంకుకు ఉండాల్సిన చాలా లక్షణాలు పోస్టాఫీసులకింకా రాలేదు. ఇదిగో… వీటన్నిటినీ కోర్ బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకొస్తామని నిర్మల హామీనిచ్చారు. అంటే పోస్టాఫీసు ఖాతాదారులంతా ఇకపై ఎక్కడి నుంచైనా ఆన్‌లైన్లో డిపాజిట్లు చేయొచ్చు. వేరే ఖాతాలకు నగదు బదిలీ చేయొచ్చు. ఆర్‌డీ, ఎఫ్‌డీ సహా బ్యాంకుల నుంచి పొందే ఆన్‌లైన్ సేవలన్నీ పొందొచ్చు.
కాలం చెల్లిన సేవలకు క్రమంగా స్వస్తి చెబుతూ…ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్నీ అందిపుచ్చుకొని వినూత్న ఆలోచనలు, సరికొత్త సేవలతో ముందడుగు వేస్తున్న పోస్టాఫీసులకు మహర్దశ పట్టనుంది. ఇప్పటికే వాణిజ్య బ్యాంకులకు దీటుగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబి) ఏర్పాటు చేసి దాని ద్వారా పోస్టాఫీసుల్లో ప్రాథమిక బ్యాంకింగ్ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టింది. పోస్టాఫీసులతో పాటు ఇంటి వద్దకు కూడా బ్యాంకింగ్ సేవలు అందిస్తోంది. తాజాగా కేంద్ర బడ్జెట్– 2022లో పోస్టాఫీసుల్లో పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ సేవలు ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించడం మరింత కలిసి వచ్చే అంశం. ఇక పోస్టాఫీసుల ద్వారా ఆన్‌లైన్ బ్యాంకింగ్,నెట్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు అందుబాటులో రానున్నాయి. ఇప్పటికే ఐపీపీ బ్యాంక్ పోస్టాఫీసుల ద్వారా మూడు రకాల జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాల సేవలు అందిస్తోంది.