మానవ సంబంధాలను మంట గలుపుతూ ఓ భార్య చేసిన ఘాతుకం ఇది! వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ యువతి తన భర్తనే హత్య చేసింది. ఆపై అతి తెలివితో కరోనా వైరస్ కారణంగా చనిపోయాడని నమ్మించేందుకు ప్రయత్నించింది. వాయవ్య ఢిల్లీలోని అశోక్ విహార్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసుల రంగప్రవేశం చేసి అంత్యక్రియలను అడ్డుకున్నారు. అనంతరం పోస్టుమార్టం చేస్తే హత్య అని తేలింది . 46 ఏళ్ల శరత్ దాస్ స్థానికంగా చిన్న దుకాణం నడుపుతున్నాడు. అయితే మే 2న అతని భార్య అనిత తన భర్త చలనం లేకుండా పడివున్నాడంటూ ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించింది. కరోనా ఇన్ఫెక్షన్ తో చనిపోయినట్టు భావిస్తున్నానని వారితో చెప్పింది. అయితే, శరత్ దాస్ ఆరోగ్యంగా ఉంటూ ఒక్కసారిగా కరోనాతో ఎలా చనిపోయాడని పక్కింటివారికి సందేహం వచ్చింది. దాంతో వారు పోలీసులకు సమాచారం చేరవేశారు. రంగప్రవేశం చేసిన పోలీసులు, భార్య అనితను భర్తకు సంబంధించిన కరోనా రిపోర్టులు తీసుకురావాలని కోరారు. రిపోర్టులు లేకపోవడంతో ఆమె నీళ్లు నమిలింది. ఆమెను తమదైన శైలిలో విచారించేసరికి అసలు నిజాలన్నీ బయటపెట్టింది.
సంజయ్ అనే మరో యువకుడితో తన ప్రేమాయణానికి అడ్డుగా ఉన్నాడనే భర్తను చంపినట్టు అంగీకరించింది. సంజయ్ తో కలిసి భర్త ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసి, హత్యచేసినట్టు వివరించింది. తన వివాహేతర సంబంధం గురించి భర్తకు కూడా తెలుసని, తామిద్దరి మధ్య తరచుగా గొడవలు జరిగేవని వెల్లడించింది. తనను భర్త సరిగా చూసుకునేవాడు కాదని కూడా అనిత పోలీసులకు తెలిపింది. ఈ హత్యోదంతంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.