అవసరమైతే ఇండియాతో యుద్ధం చేయడానికి తమ దేశ సైన్యం సిద్ధంగా ఉందని నేపాల్ రక్షణ మంత్రి ఈశ్వర్ పోఖ్రేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర తదితర ప్రాంతాలు తమవేనని నేపాల్ వాదిస్తున్న వేళ, భారత ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే, ఇటీవల మాట్లాడుతూ, మరో దేశం తరఫున నేపాల్ వకాల్తా పుచ్చుకుందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇండియాతో చైనా చేస్తున్న ప్రచ్ఛన్న యుద్ధంలో నేపాల్ చైనాకు అనుకూలంగా మారిపోయిందని కూడా అన్నారు. తమ దేశానికి అత్యవసరమైతే నేపాల్ సైన్యం స్వయంగా రంగంలోకి దిగాలే తప్ప, మరొకరిపై ఆధారపడరాదని వ్యాఖ్యానించారు.
నరవాణే వ్యాఖ్యలను ప్రస్తావించిన ఈశ్వర్ పోఖ్రేల్, రాజకీయ ఉద్దేశాలతో తమ సైన్యాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. ఇండియాను రక్షించేందుకు నేపాలీ గూర్ఖా సైన్యం తమ ప్రాణాలను అర్పించిన సంగతిని ఆయన మరిచారని అన్నారు. వారి మనోభావాలను నరవాణే కించ పరిచారని, గూర్ఖా బలగాలకు ఎదురుగా నిలవడం ఇండియాకు కష్టంగా మారినట్టుందని అన్నారు. సమయం వచ్చి, యుద్ధమే అవసరమైతే తమ సైన్యం సిద్ధంగా ఉందని, దీటుగా బదులిచ్చేందుకు వెనుకాడదని అన్నారు. తమ రాజ్యాంగాన్ని అనుసరించి, ప్రభుత్వం ఆదేశిస్తే, ఆర్మీ తన పాత్రను పోషిస్తుందని కటువు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో కాలాపానీ విషయంలో వివాదాన్ని పరిష్కరించుకునేందుకు చర్చలే మార్గమని తాము నమ్ముతున్నామని, ద్వైపాక్షిక చర్చలకే మొగ్గు చూపుతామని ఆయన అనడం గమనార్హం.