- మాజీ రంజీ క్రికెటర్ నాగరాజు అరెస్టు
- రూ.10 లక్షలు స్వాధీనం
వివరాలు వెల్లడిస్తున్న కమిషనర్ అంజనీకుమార్, చిత్రంలో నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ అధికారులుహలో… నేను రాష్ట్ర మంత్రి కేటీఆర్ వ్యక్తిగత కార్యదర్శి తిరుపతిని మాట్లాడుతున్నా.. మరో వారం రోజుల్లో మా సార్ (కేటీఆర్) సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. హోర్డింగ్‌లు, పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలి. కాబట్టి మీవంతు సహకారాన్ని కోరుతున్నాం” అంటూ వసూళ్లకు పాల్పడుతున్న మాజీ రంజీ క్రికెటర్ బుదుమూరు నాగరాజును పోలీసులు అరెస్టు చేశారు.నగర పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో శనివారం సీపీ అంజనీకుమార్ వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా పొలాకి మండలం యవ్వారిపేట గ్రామానికి చెందిన నాగరాజు(25) ఎంబీఏ చదివి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. 2014-16 సంవత్సరంలో ఏపీ నుంచి రంజీ ప్లేయర్‌గా ఆడాడు. జల్సా జీవితానికి అలవాటు పడిన అతను పలువురు మంత్రులు, ప్రముఖుల వ్యక్తిగత కార్యదర్శినంటూ డబ్బులు డిమాండ్ చేసేవాడు.మంత్రి కేటీఆర్ వ్యక్తిగత కార్యదర్శినంటూ మాదాపూర్, బంజారాహిల్స్, గచ్చిబౌలి ప్రాంతాల్లోని కంపెనీ యాజమాన్యాల నుంచి వసూళ్లకు పాల్పడ్డాడు. ఇటీవల బంజారాహిల్స్ పరిధిలో ఓ సంస్థ నుంచి రూ.4.78 లక్షలు, సనత్‌నగర్ ఠాణా పరిధిలో రూ.7.42 లక్షలు, మాదాపూర్ ఠాణా పరిధిలో రూ.17.50 లక్షలు, గచ్చిబౌలిలో రూ.4.52లక్షలు, కూకట్‌పల్లిలో రూ.4లక్షలు వసూలు చేశాడు. ఇలా మొత్తం రూ.39,22,400 వసూలు చేశాడని చెప్పారు. అతని వద్ద రూ.10 లక్షలు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా నాగరాజుపై గతంలో ఏపీలోని పలు జిల్లాలు, నరగంలోని పలు ఠాణాల్లో కేసులు నమోదై జైలుకు వెళ్లొచ్చాడని, నిందితుడిపై పీడీయాక్ట్ ప్రయోగిస్తామని కమిషనర్ వెల్లడించారు. టాస్క్‌ఫోర్స్ అధికారులు నాగేశ్వరరావు, రాధాకిషన్‌రావు పాల్గొన్నారు.