contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మహిళలపై పెరుగుతున్న గృహహింస… ఇంటి వద్దకే పోలీసు సేవలు : మహబూబ్ నగర్ ఎస్పీ

 

యావత్ ప్రపంచం కరోనా మహమ్మారితో సతమతమవుతున్న వేళ కూడా మహిళలకు గృహహింస తప్పడంలేదన్న కఠోర నిజం ఎంతో బాధిస్తుంది. సాధారణ పరిస్థితుల్లోనే మహిళలు తమకు ఎదురైన గృహ హింసపై బయట చెప్పుకోలేని పరిస్థితి ఉంది. ఇక లాక్ డౌన్ వేళ కాలు బయటపెట్టే వీల్లేక, భర్త, ఇతర కుటుంబసభ్యుల నుంచి ఎదురయ్యే హింసను మౌనంగా భరిస్తూ తమలో తాము కుమిలిపోతున్న మహిళలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్లకు తాము అండగా నిలుస్తామని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ రమా రాజేశ్వరి అంటున్నారు. చెప్పడమే కాదు, గృహహింస బాధితుల కోసం ఆమె ఓ మొబైల్ టీమ్ ను కూడా ఏర్పాటు చేశారు. తమకు ఎదురవుతున్న హింస పట్ల కొద్దిపాటి సమాచారం అందించినా చాలు… ఈ మొబైల్ టీమ్ బాధితురాలి ఇంటి ముందు వాలిపోతుంది. కొంతకాలం కిందట ఎస్పీ రమా రాజేశ్వరికి కాన్పూర్ నుంచి వచ్చిన ఓ ఫోన్ కాల్ ఈ మొబైల్ టీమ్ ఏర్పాటుకు దారితీసింది. కాన్పూర్ నుంచి ఓ మహిళ ఫోన్ చేసి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న తన సోదరి మూడు రోజులుగా ఫోన్ లిఫ్ట్ చేయడంలేదని, ఆమెకు ఏమైందో తెలియడంలేదని ఆందోళన వ్యక్తం చేసింది. దాంతో ఆమె సోదరి ఇంటికి పోలీసులను పంపగా, పోలీసులు అక్కడి దృశ్యం చూసి చలించిపోయారు.తీవ్ర గాయాలతో ఆమె దాదాపు బంధించబడి ఉన్న స్థితిలో దర్శనమిచ్చింది. మూడ్రోజుల నుంచి పచ్చి మంచినీళ్లు కూడా ఇవ్వకుండా భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఆమెను వేధిస్తున్న తీరు పోలీసుల రాకతో వెల్లడైంది. కాన్పూర్ లో ఉన్న ఆమె సోదరి అభ్యర్థన మేరకు బాధితురాలిని ప్రత్యేక అనుమతితో తెలంగాణ నుంచి ఉత్తరప్రదేశ్ తరలించారు. ఈ ఘటన ఎస్పీ రమా రాజేశ్వరిని మొబైల్ సేఫ్టీ టీమ్ ఏర్పాటుకు పురికొల్పింది. లాక్ డౌన్ పరిస్థితులన్నీ తొలగిపోయి, బాధితులు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదులు చేయడం ఇప్పట్లో సాధ్యం కాదని గ్రహించిన ఎస్పీ… నేరుగా బాధితుల వద్దకే పోలీసుల సేవలు చేరాలని గ్రహించారు. ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఈ మొబైల్ సేఫ్టీ వాహనం తిరుగుతోంది. కేవలం 2 వారాల్లో 40 గృహహింస కేసులు వెల్లడయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :