భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:నిషేధిత మావోయిస్టు పార్టీ శబరి కమాండర్ కలుమదేవి అలియాస్ సంధ్య గురువారం భద్రాచలం ఏఎస్పీ రాజేష్ చంద్ర సమక్షంలో లొంగి పోయినారు. ఈ సందర్భంగా భద్రాచలం ఏఎస్పి కార్యాలయం నందు ఏఎస్పీ రాజేష్ చంద్ర విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలుమ దేవి ఆలియాస్ సంధ్య సిపిఐ మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై 2014 లో మావోయిస్టు పార్టీలో చేరారని ఆయన తెలిపారు. మడకం ప్రకాష్ ఏరియా కమిటీ కమాండర్ ప్రోద్బలంతో చర్ల మిలిషియా లో చేరి నిషేధిత మావోయిస్టు పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాలు పంచుకోవడం జరిగిందన్నారు. 2016 నుండి 2017 వరకు నిషేధిత మావోయిస్టు చర్ల ఎల్ ఓ ఎస్ లో శారదక్క నాయకత్వంలో ఆమెకు గార్డుగా పని చేసిందని ఆయన తెలిపారు. 2017 నుండి 2019 వరకు కలుమా దేవి ఆలియాస్ సంధ్య శబరి డిప్యూటీ కమాండెంట్ పని చేసిందని, 2019, 2020 మధ్య కొంత కాలం శబరి ఇన్ ఛార్జ్ కమాండర్ గా కూడా పని చేసిందని తెలిపారు. మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు నచ్చక పార్టీలో పని చేసేందుకు ఆసక్తి లేక జనజీవన స్రవంతిలో కలవాలని పార్టీ నుంచి బయటకు వచ్చి లొంగిపోయినట్లు తెలిపిందని ఆయన తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టు సంధ్యకు ప్రభుత్వం నుంచి రావలసిన అన్ని రాయితీలను రివార్డు పాలసీ ప్రకారం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. బూజుపట్టిన మావోయిస్టు సిద్ధాంతాలను వదిలి, జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన మావోయిస్టు పార్టీ సభ్యులకు సూచించారు.