contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మే 3 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు..ప్రధాని మోదీ

కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. మే 3 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. కష్టమైనా, నష్టమైనా రాజ్యాంగంలో ‘వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా..’ అన్న పదానికి ప్రజలు సంపూర్ణ నిదర్శనంగా నిలుస్తున్నారని ఆయన కొనియాడారు. భారత్ అంటేనే భిన్నసంస్కృతులు, మతాలు, ఉత్సవాలు అని తెలిపారు.అంబేద్కర్ చెప్పిన మాటలు మనకు నిరంతరం ప్రేరణ ఇస్తున్నాయని మోదీ తెలిపారు. ప్రజలు ఒక్కతాటిపై నిలబడి పరస్పరం సహకరించుకోవడమే అంబేద్కర్‌కు ఇచ్చే నివాళని చెప్పారు. లాక్‌డౌన్ అమలు ఉండగానే ఉగాది నుంచి విశూ వరకు పండుగలు జరుపుకున్నామని ఆయన అన్నారు.
మే 3 వరకు సహకరించాలి
మే 3 వరకు దేశ పౌరులు అందరూ లాక్ డౌన్ కు సహకరించాలని తాను కోరుతున్నట్లు తెలిపారు. త్వరితగతిన నిర్ణయాలు తీసుకోకపోతే దేశ పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవచ్చని ఆయన అన్నారు. పరిస్థితులు చేజారిపోయే వరకు చూస్తూ ఊరుకోవద్దని ఆయన చెప్పారు.
దేశంలో కొవిడ్‌-19 కేసులు 100 నమోదు కాకముందే విదేశాల నుంచి వచ్చే వారికి స్క్రీనింగ్, క్వారంటైన్‌ వంటి చర్యలు తీసుకున్నామనీ, దేశంలో 550 కేసులు నమోదు కాగానే 21 రోజుల లాక్‌డౌన్‌ విధించామని చెప్పారు.
ఏప్రిల్‌ 20 నుంచి అత్యవసర విషయాలకు అనుమతులు
ఏప్రిల్‌ 20 నుంచి అత్యవసర విషయాలకు కొన్ని ప్రత్యేక అనుమతులు ఉంటాయని ప్రధాని మోదీ ప్రకటించారు. అయితే, ఇందులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ఆ అనుమతులను వెనక్కి తీసుకుంటామని ప్రకటించారు. లాక్‌డౌన్‌ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించే ప్రసక్తేలేదని చెప్పారు.గరీబ్ కల్యాణ్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం నుంచి తగినంత సాయం అందిస్తున్నామని చెప్పారు. ఆహార వస్తువులు, మందుల సరఫరా వంటివాటిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి అవరోధం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పేదలు, కూలీలు ఇబ్బందులు పడుతున్న విషయం వాస్తవమేనని ఆయన తెలిపారు.
ఎవరినీ ఉద్యోగాల నుంచి తీసేయొద్దు
ప్రతి రాష్ట్రం, ప్రతి ప్రాంతం కరోనా నుంచి ప్రజలను కాపాడుకోవడానికి చర్యలు తీసుకోవాలని మోదీ అన్నారు. ఒక్క హాట్‌స్పాట్‌ కూడా పెరగకుండా చూసుకోవాలని ఆయన చెప్పారు. ఈ రెండో దశ పరీక్షలో దేశమంతా సమర్థవంతంగా పనిచేయాలని కోరారు. కొత్తగా ఎవరూ కరోనా బారిన పడకుండా ఉండాలన్న లక్ష్యంతో పని చేద్దామని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య సేతు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఆయన సూచించారు. పరిశ్రమల్లో ఎవరినీ ఉద్యోగాల నుంచి తీసేయొద్దని ఆయన కోరారు.
కరోనాపై నిర్ణయాలు తీసుకునేముందు తాము దేశంలోని పేదలు, కూలీలు, రైతులను దృష్టిలో పెట్టుకున్నామని ప్రధాని మోదీ తెలిపారు. వారికి ఇబ్బందులు తలెత్తకుండా పలు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రజలంతా లాక్‌డౌన్‌ నిబంధనలను బాధ్యతగా పాటించి జాతిని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు.
వైద్య సిబ్బందిని గౌరవించాలి
కరోనాపై పోరాటంలో భారత్‌ సీరియస్‌గా పనిచేస్తోందని ఆయన చెప్పారు. కరోనాపై పోరాటం చేస్తోన్న యోధులను ప్రజలంతా గౌరవించాలని ఆయన కోరారు. వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులను ప్రజలు గౌరవించాలని ఆయన చెప్పారు. దేశంలోని 220 ల్యాబుల్లో కరోనా పరీక్షలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. దేశంలో కరోనా కోసం లక్ష బెడ్లు సిద్ధం చేశారని తెలిపారు. దాదాపు 600 ఆసుపత్రుల్లో కరోనా చికిత్స అందుతోందని వివరించారు. ఈ సౌకర్యాలను మరింత పెంచుతున్నట్లు తెలిపారు.
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :