మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం సీతారాం తండాలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసి, అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హత్యకు గురైన బాలిక కుటుంబసభ్యులను ఈరోజు ఆమె పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలంగాణలో మహిళలకు రక్షణే లేకుండా పోయిందని మండిపడ్డారు. ఎక్కడ చూసినా హత్యలు, లైంగిక వేధింపులే కనిపిస్తున్నాయని అన్నారు. హత్యాచారం చేసిన నిందితులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా త్వరితగతిన ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
ఘటన వివరాల్లోకి వెళ్తే, సీతారాం తండాకు చెందిన 17 ఏళ్ల మైనర్ బాలిక ఇంటర్ చదువుతోంది. కిరాణా సరుకుల కోసం దుకాణానికి వెళ్లిన ఆమె… ఒక గంట తర్వాత గుట్టల్లో అచేతనంగా కనిపించింది. తండావాసులు, బంధువులు అక్కడకు వెళ్లి చూడగా రక్తస్రావంతో ఆమె విగతజీవిగా కనిపించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.