రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి ఉదయలక్ష్మిపై ఏపీ హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఉదయలక్ష్మి గతంలో ఏపీ ఉన్నత విద్యాశాఖ కమిషనర్ గా వ్యవహరించారు. ఆ సమయంలో, ఓ వ్యాయామ ఉపాధ్యాయుడి అంశంలో కోర్టు ఉత్తర్వులు బేఖాతరు చేశారంటూ హైకోర్టు తాజాగా వారెంట్ జారీ చేసింది. తనకు అన్యాయం జరిగిందని రాజమండ్రికి చెందిన పీఈటీ రత్నకుమార్ గతంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు వ్యాయామ ఉపాధ్యాయుడు రత్నకుమార్ కు న్యాయం చేయాలని ఆదేశించింది.
అయితే, తన ఆదేశాలను ఉదయలక్ష్మి పట్టించుకోకపోవడాన్ని కోర్టు ధిక్కరణగా పేర్కొంటున్నట్టు హైకోర్టు తాజా విచారణలో వెల్లడించింది. ఈ కేసు తదుపరి విచారణలో ఉదయలక్ష్మిని తమ ఎదుట హాజరుపర్చాలని గుంటూరు ఎస్పీని ఆదేశించింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని గతంలో విద్యాశాఖలో పనిచేసిన ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు స్పష్టం చేసింది. తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది.