అర్ణబ్ గోస్వామి అరెస్ట్ తో ఇప్పటికే షాక్ లో ఉన్న జాతీయ మీడియా సంస్థ రిపబ్లిక్ టీవీకి మరో షాక్ తగిలింది. ఛానల్ డిస్ట్రిబ్యూషన్ హెడ్ ఘన్ శ్యామ్ సింగ్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. టీఆర్పీ రేటింగ్స్ ను తారుమారు చేశారంటూ అందిన ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. టీఆర్పీ అవకతవలకు సంబంధించి తాజా అరెస్ట్ ను కలిపితే… ఇప్పటి వరకు మొత్తం 12 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘన్ శ్యామ్ ను ఈరోజు కోర్టు ముందు పోలీసులు ప్రవేశపెట్టనున్నారు.రిపబ్లిక్ టీవీపై కొందరు వీక్షకులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసులు నమోదు చేయడం ప్రారంభించారు. తాము టీవీ చూడకపోయినా… రిపబ్లిక్ టీవీని ఆన్ చేసి పెట్టుకుంటే తమకు డబ్బులు చెల్లిస్తారని వారు చెప్పడంతో… మీడియా ప్రపంచంలో అలజడి చెలరేగింది. వెంటనే రంగంలోకి దిగిన ముంబై పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకోవడం ప్రారంభించారు. అయితే అర్నాబ్ గోస్వామిని మాత్రం వేరే కేసులో అరెస్ట్ చేశారు. ఒక ఇంటీరియర్ డిజైనర్, ఆయన తల్లి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారనే ఆరోపణలతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.