బెంగళూరు: ఓవైపు కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా యావత్ దేశం ఏకమై పోరాడుతోంటే .. మరోవైపు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి శుక్రవారం తన కుమారుడు నిఖిల్ కుమారస్వామి వివాహ వేడుకను జరిపించారు. బెంగళూరు శివార్లలోని రామనగరంలో జరిగిన ఈ వివాహాన్ని కవర్ చేసేందుకు మీడియా సిబ్బందిని అనుమతించలేదు. కానీ ఈ వివాహ మహోత్సవానికి అనేక మంది విఐపి అతిథులుగా హాజరైన తీరు చూస్తోంటే.. వీలు ఉన్నంత మేరకు పెళ్లి ఘనంగానే జరిగినట్టు తెలుస్తోంది. వివాహ వేడుక ఫోటోలు, వీడియోలు చూస్తుంటే సోషల్ డిస్టన్సింగ్ నిబంధనలను ఉల్లంఘించినట్టు స్పష్టమవుతోంది. దేశానికి మాజీ ప్రధాని, రాష్ట్రానికి మాజీ ముఖ్య మంత్రి ఉన్న ఇంట్లో ఇలా లాక్‌డౌన్ నిబంధనలకు విరుద్ధంగా వివాహం జరిపించడం ఏంటనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిఖిల్ పెళ్లి గురించి ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మాట్లాడుతూ.. ఈ వివాహం ఎంతో సాదాసీదాగా ఉంటుందని అన్నారు. అంతేకాకుండా ఈ పెళ్లి వేడుకకు హాజరుకావద్దని పార్టీ కార్యకర్తలకు ఆయన విజ్ఞప్తి చేశారు. కానీ పెళ్లి జరిగిన తీరు సాదాసీదాగానే ఉన్నప్పటికీ.. సోషల్ డిస్టన్సింగ్ నిబంధనను మాత్రం అతిక్రమించడమైతే జరిగింది కదా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి