ఎంతో ఆనందంగా వివాహం చేసుకున్నానన్న ఆ యువకుడి ఆనందం ముచ్చటగా మూడు రోజులైనా మిగల్లేదు. లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో ఈ గానా భజానాలు, విందులు ఏంటని ప్రశ్నిస్తూ, ఏకంగా వరుడినే అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్లడంతో బంధుమిత్రులంతా ఖంగుతిన్నారు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో జరిగింది. వివరాల్లోకి వెళితే, కంధమల్ జిల్లా, నౌపాద గ్రామంలో పరమేశ్వర్ భుక్తా అనే యువకుడి పెళ్లి రిసెప్షన్ కు ఏర్పాట్లు జరిగాయి. ఈ విందుకు సుమారు 80 మంది వరకూ గ్రామస్తులు హాజరయ్యారు. ఇప్పటికే ఏడుగురి కన్నా ఎక్కువ మంది ఓ ప్రాంతంలో చేరవద్దని ఒడిశా సర్కారు ఆదేశించివుండటంతో, విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు, రిసెప్షన్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి, వరుడిని పోలీసు స్టేషన్ కు తరలించారు.