ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 5 ఆదివారం రాత్రి 9 గంటలకు అందరూ ఇళ్లలో విద్యుత్ లైట్లు ఆర్పేసి కొవ్వొత్తులు, టార్చిలైట్లు వెలిగించాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు. “ఈ దేశం ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ కాదు. భారతదేశ ప్రజలందరూ మనుషులే, వారికీ ఆశలు, ఆశయాలు ఉంటాయి. 9 నిమిషాల గిమ్మిక్కులతో జీవితాలను దిగజార్చవద్దు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఏం లభిస్తోంది? పేదవాళ్లకు ఎలాంటి ఊరట దక్కుతోంది? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నాం. చేయాల్సింది చేయకుండా మళ్లీ ఓ కొత్త డ్రామాకు తెరలేపారు” అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.
“ఈ ట్యూబ్ లైట్ ఐడియా ఎక్కడా కనలేదు, వినలేదు. దేశవ్యాప్తంగా వలస కార్మికులు ఆకలితో అలమటిస్తూ, గూడు లేక కాలినడకన ఇళ్లకు పయనమయ్యారు. ప్రధాని గారూ, ఎక్కడుంది మీరు చెబుతున్న వెలుగు? వలస కార్మికుల ద్వారా కరోనా ఇన్ఫెక్షన్లు మరింత ప్రబలమవుతాయని మీ లాయర్లు సుప్రీంకోర్టులో వాదిస్తున్నారు. కానీ మీ ఆరోగ్యమంత్రిత్వ శాఖ భారత్ లో సామాజిక సంక్రమణం ద్వారా కరోనా వైరస్ వ్యాపించడం తక్కువేనని చెబుతోంది. ఆర్థికసాయం అందించాలని సీఎంలు కోరుతుంటే లైట్లు ఆర్పేయాలని చెబుతారా?” అంటూ వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు.