దేశంలో కులం కోసం చొక్కాలు చింపుకునే వారి సంఖ్య పెద్ద శాతంలోనే ఉంటుంది. కులం కార్డు మీదే రాజకీయాలు కూడా నడుస్తుంటాయి. ఈ నేపథ్యంలో, కులపిచ్చిని తగ్గించేందుకు యూపీలోని యోగి ఆదిత్యనాథ్ సర్కారు ఇటీవలే ఒక నిబంధనను తీసుకొచ్చింది.వాహనాల అద్దాలు, నంబర్ ప్లేట్లపై కులం పేర్లను రాయకూడదనేదే ఆ నిబంధన. తాజాగా ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. కులాల పేర్లు రాసుకునే వారికి నడ్డి విరిచే ప్రక్రియను యూపీ పోలీసులు ప్రారంభించారు. రాజధాని లక్నోలోని ఒక కారు వెనుక అద్దంపై దాని యజమాని ఆశిష్ సక్సేనా ‘సక్సేనా జీ’ అని రాసుకున్నాడు. సక్సేనా అనే పదం ఒక కులాన్ని సూచిస్తుంది. దీంతో, కారును ఆపిన పోలీసులు చలానా విధించారు.ఈ సందర్భంగా కాన్పూర్ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ డీకే త్రిపాఠి మాట్లాడుతూ, యూపీలో తిరుగుతున్న ప్రతి 20 వాహనాల్లో ఒక వెహికల్ పై కులం పేరుతో కూడిన స్టిక్కర్ ఉంటుందని చెప్పారు.