విశాఖపట్నంలో ఇటీవల ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టైరీన్ విషవాయువు లీకవడం ఎంతటి భయాందోళనలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ విషయం మరుగున పడకముందే మరో కలకలం రేగింది. విశాఖలోని హెచ్ పీసీఎల్ రిఫైనరీలో తెల్లని పొగలు కనిపించడం స్థానికులను హడలెత్తించింది. రిఫైనరీలోని ఎస్ హెచ్ యూ విభాగాన్ని తెరిచే ప్రయత్నంలో తెల్లని పొగలు రావడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురై ఇళ్ల నుంచి ఒక్కసారిగా బయటికి వచ్చారు.అయితే కాసేపటికే పొగలు తగ్గిపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై హెచ్ పీసీఎల్ యాజమాన్యం స్పందిస్తూ, ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగినట్టు గుర్తించామని, సమస్యను వెంటనే చక్కదిద్దామని తెలిపింది. ఇప్పుడు ఎలాంటి పొగ రావట్లేదని స్పష్టం చేసింది.