వ్యోమనౌక వీఎస్ఎస్ యూనిటీ-22 నింగిలోకి దూసుకెళ్లింది. వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్‌సన్ బృందం రోదసి యాత్ర ప్రారంభమైంది. తెలుగమ్మాయి బండ్ల శిరీష సహా ఆరుగురు వ్యోమగాములతో న్యూమెక్సికో నుంచి వర్జిన్ గెలాక్టిక్ సంస్థ వ్యోమనౌక రోదసీలోకి పయనమైంది. మొదటగా వీఎంఎస్ ఈవ్ విమానం యూనిటీ-22ను 15 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకువెళ్లనుంది. రాకెట్ ఇంజిన్ ప్రజ్వలనంతో యూనిటీ-22 స్పేస్ ఫ్లైట్ మరింత ఎత్తుకు వెళ్లనుంది. చివరిదశలో యూనిటీ-22 స్పేస్ ఫ్లైట్ సొంత ప్రయాణాన్ని ప్రారంభించనుంది.
యూనిటీ-22 సిబ్బందిలో భాగం కావడం అదృష్టమంటూ శిరీష ట్వీట్ చేసింది. భూమికి 90 కిలోమీటర్ల ఎత్తు వరకూ వీళ్లు వెళ్లనున్నారు. అక్కడ కొన్ని నిమిషాల భార రహిత స్థితిలో ఉన్న తర్వాత తిరిగి భూమి వైపు ప్రయాణం కానున్నారు. ఈ మొత్తం ప్రయాణం 90 నిమిషాల్లో ముగుస్తుందని గతంలో బ్రాన్సన్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన బండ్ల శిరీష కొన్నాళ్లుగా వర్జిన్ గెలాక్టిక్‌లో ప్రభుత్వ వ్యవహారాలు, రీసెర్చ్ ఆపరేషన్‌ల వైస్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నారు. శిరీష 2015లో ప్రభుత్వ వ్యవహారాల మేనేజర్‌గా వర్జిన్ గెలాక్టిక్‌లో చేరారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడీ స్థాయికి చేరుకున్నారు. ఈ మధ్యే 747 ప్లేన్ ఉపయోగించి అంతరిక్షంలోకి శాటిలైట్‌ను లాంచ్ చేసిన వర్జిన్ ఆర్బిట్ వాషింగ్టన్ ఆపరేషన్స్‌ను కూడా చూసుకుంటోంది. పర్‌డ్యూ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్, జార్జ్‌టౌన్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు.
ఇప్పుడు శిరీష ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకోబోతోంది. స్పేస్‌లో అడుగుపెట్టబోతున్న రెండో భారతీయ మహిళ కాగా.. ఓవరాల్‌గా నాలుగో ఇండియన్. మన దేశం తరఫున రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లిన తొలి వ్యక్తి కాగా.. కల్పనా చావ్లాతో పాటు మరో ఇండియన్-అమెరికన్ ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ కూడా ఈ ఘనత సాధించారు.