లాక్ డౌన్ ప్రభావంతో ఇన్నాళ్లు మూతపడిన మద్యం దుకాణాలు మళ్లీ కళకళలాడుతున్నాయి. కేంద్రం మార్గదర్శకాలు సవరించడంతో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ఏపీలో కూడా మద్యం అమ్మకాలు ప్రారంభం కాగా, నిన్న 25 శాతం ధరలు పెంచిన ప్రభుత్వం నేడు అందుకు అదనంగా మరో 50 శాతం వడ్డించింది. మొత్తమ్మీద మద్యంపై 75 శాతం ధరలు పెంచారు. దీనిపై సీఎం జగన్ వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో మద్యపానాన్ని నిరుత్సాహపరిచేందుకే భారీగా ధరలు పెంచామని అన్నారు. మద్యం రేట్లు షాక్ కొట్టేలా ఉండాలని అనుకున్నామని తెలిపారు. మున్ముందు మద్యం అమ్మకాలు తగ్గుతాయని భావిస్తున్నట్టు వెల్లడించారు.మద్యం దుకాణాలు 13 శాతం తగ్గించాలని నిర్ణయం తీసుకున్నామని, తద్వారా రాష్ట్రంలో మద్యం దుకాణాలు 33 శాతం తగ్గించినట్టవుతుందని వివరించారు. మద్యం అక్రమ తయారీ, రవాణాలను అడ్డుకోవాల్సిన బాధ్యత ఎస్పీలపైనే ఉందని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇసుక మాఫియా, అక్రమ మద్యం ఎట్టిపరిస్థితుల్లోనూ ఉండకూడదని భావిస్తున్నామని, ఈ రెండు అంశాలను తానే పర్యవేక్షిస్తున్నానని చెప్పిన సీఎం, ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు గట్టిగా పనిచేయాలని సూచించారు.