తూర్పు లడఖ్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు తగ్గించడానికి పలు కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు భారత్, చైనాలు వెల్లడించాయి. సోమవారం చుషుల్ వద్ద మాల్డో ప్రాంతంలో భారత్-చైనా సైనికాధికారుల మధ్య జరిగిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయించినట్టు తెలిపాయి. సరిహద్దులకు అదనపు బలగాలను తరలించరాదని, క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఏకపక్షంగా మార్చకూడదని తీర్మానించినట్టు పేర్కొన్నాయి. పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసే చర్యలకు దూరంగా ఉండాలన్న ఏకాభిప్రాయానికి వచ్చినట్లు వివరించాయి.సోమవారం ఉదయం 9.00 గంటల నుంచి రాత్రి 11.00 గంటల వరకు ఏకంగా 14 గంటలపాటు సాగిన ఆరో విడత చర్చలపై మంగళవారం రాత్రి భారత్, చైనాలు ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి. క్షేత్రస్థాయిలో సంబంధాలను మరింత మెరుగుపరచుకోవాలని కూడా ఈ భేటీలో నిర్ణయించినట్లు రెండు దేశాల సైన్యాలు తెలిపాయి. అపోహలు, పొరపాట్లకు ఆస్కారం లేకుండా చూడాలని నిర్ణయించినట్లు పేర్కొన్నాయి.సరిహద్దు వివాదాల పరిష్కారంపై భారత్-చైనా దేశాధినేతల మధ్య కుదిరిన ఏకాభిప్రాయ స్ఫూర్తిని నిబద్ధతతో అమలు చేయాలని కూడా తీర్మానించినట్లు వివరించాయి. కాగా, ఈ అంశంపై భారత సైన్యం విడిగా ఒక ప్రకటన విడుదల చేసింది. ‘వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి పరిస్థితులపై ఇరు వర్గాలూ లోతుగా చర్చించాయి. ఉద్రిక్తతలను తగ్గించే అంశంపై తమ అభిప్రాయాలను ఇచ్చిపుచ్చుకున్నాయి. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరానికి ఆచరణాత్మక చర్యలు తీసుకోవాలని, సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని ఉమ్మడిగా పరిరక్షించాలని నిర్ణయించాయి’ అని తెలిపింది.ఈ చర్చల ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లాలన్న అభిప్రాయం కూడా వ్యక్తమైనట్లు వివరించింది. వీలైనంత త్వరగా ఏడో విడత సైనిక కమాండర్ల చర్చలను నిర్వహించాలని కూడా తీర్మానించినట్లు పేర్కొంది. మే నెల తొలివారంలో భారత్, చైనా సైన్యాల మధ్య ఘర్షణ తలెత్తిన తర్వాత వివాదం పరిష్కారానికి రెండు దేశాల మధ్య జరిగిన నిర్దిష్ట చర్యల వివరాలను ప్రకటించడం ఇదే తొలిసారి. సరిహద్దు వివాద పరిష్కారానికి అనువైన వాతావరణాన్ని సృష్టించేందుకు చేస్తున్న ప్రయత్నంగా దీనిని పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. సోమవారం నాటి చర్చలు ఫలితాన్ని ఇవ్వలేదని అధికార వర్గాలు తెలిపాయి. సరిహద్దుల నుంచి బలగాల ఉపసంహరణ ప్రక్రియ చాలా సంక్లిష్టమైందన్న అభిప్రాయం వ్యక్తమైనట్టు పేర్కొన్నాయి. ప్రధానంగా ఉద్రిక్తతలను తగ్గించే అంశంపైనే ఈ సమావేశం సాగిందని, పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలో వ్యూహాత్మక శిఖరాల నుంచి భారత బలగాలు వైదొలగాల్సిందేనని చైనా పట్టుబట్టిందని వివరించాయి. అయితే ఫింగర్-4 నుంచి 8 వరకూ ఉన్న ప్రాంతాల నుంచి డ్రాగన్ బలగాలు తొలుత వెనక్కి తగ్గాలని మన దేశం డిమాండ్ చేసిందన్నాయి.