ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా షూటింగ్స్ విషయమై తొందరపడటం మంచిది కాదని, ఈ నెలాఖరు వరకు ఓపిక పట్టాలని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణలో సినిమా పరిశ్రమ గురించి ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. జూన్ నుంచి షూటింగ్స్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పై మాట్లాడుకునే అవకాశం ఉంటుందని అన్నారు. ఇవాళ జరగనున్న కేబినెట్ సమావేశంలో ఈ విషయమై ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. చిత్ర పరిశ్రమలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మంది బతుకుతున్నారని అన్నారు.లాక్ డౌన్ కారణంగా సినీ పరిశ్రమ చాలా ఇబ్బందులు పడుతోందని, దీని కోసం ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే చర్చించామని అన్నారు. చిత్రపరిశ్రమను మరింత అభివృద్ధి చేసే విషయమై ఇప్పటికే చిరంజీవి, నాగార్జునలతో మూడుసార్లు సమావేశమయ్యామని తెలిపారు. ఒక నూతన పాలసీని విడుదల చేయాలని అనుకున్న తరుణంలో ‘కరోనా’ వచ్చిందని అన్నారు. రాబోయే రోజుల్లో మరింత మెరుగైన పాలసీని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.