మొదట్లో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ పాలనలో ఉన్న మన దేశాన్ని.. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటన్ నేరుగా పాలించడం మొదలుపెట్టింది. ఆ సమయంలోనే మన దేశానికంటూ మొదటిసారిగా 1860 ఏప్రిల్ 7న బడ్జెట్ ప్రవేశపెట్టారు. బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం తరఫున స్కాటిష్ ఆర్థికవేత్త, రాజకీయ నాయకుడు జేమ్స్ విల్సన్ ఆ బడ్జెట్ రూపొందించి, బ్రిటిష్ పార్లమెంట్‌కు సమర్పించారు. స్వాతంత్య్ర భారతంలో 1947 నవంబర్ 26న అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి ఆర్‌కే షణ్ముగం శెట్టి తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
కేంద్ర బడ్జెట్ రూపకల్పన, పత్రాల ముద్రణ అత్యంత రహస్యంగా సాగుతుంది. బడ్జెట్‌లోని అంశాలు ముందే తెలిస్తే.. ఎవరైనా వాటిని మార్చేలా ప్రభావితం చేయడానికి వీలు ఉంటుందన్నదే దీనికి కారణం. అందుకే బడ్జెట్ పత్రాలను ముద్రించినన్ని రోజులు సిబ్బంది ఎవరినీ బయటికి వెళ్లనివ్వరు. 1950 వరకు రాష్ట్రపతి భవన్‌లో బడ్జెట్ పత్రాలు ముద్రించేవారు. ఆ ఏడాది బడ్జెట్ రహస్యాలు ముందే లీకవడంతో ముద్రణను ఢిల్లీలోని మింట్ రోడ్‌లో ఉన్న ప్రింటింగ్ ప్రెస్‌కు మార్చారు. 1980 నుంచి కేంద్ర ఆర్థికశాఖ కార్యాలయం ఉండే నార్త్‌బ్లాక్‌లో బడ్జెట్ పత్రాలను ముద్రిస్తున్నారు.