తిరుపతి: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న మ్యాన్ స్క్రిప్ట్స్ ప్రాజెక్టులో స్కాన్ చేసిన తాళపత్ర గ్రంథాలు 500 ఏళ్ళు గడచినా చెక్కుచెదరని విధంగా భద్రపరచాలని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి చెప్పారు. ఇందుకు అవసరమైన అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలని అధికారులకు ఆయన సూచించారు. మ్యాన్ స్క్రిప్ట్ ప్రాజెక్టు ప్రగతిపై సోమవారం శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. నెలరోజులుగా జరిగిన ప్రాజెక్టు ప్రగతిపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ, వేద విశ్వవిద్యాలయంలో నడుస్తున్న మ్యాన్ స్క్రిప్ట్ ప్రాజెక్టుకు జాతీయ మ్యాన్ స్క్రిప్ట్ మిషన్ తో అవగాహన ఉందని ఆయన చెప్పారు. తాళపత్ర గ్రంధాలను భద్రపరచడం, గ్రంథీ కరణ చేయడం లాంటి పనుల్లో వారి సహకారం తీసుకోవాలని చెప్పారు. పురావస్తు శాఖ, ఎస్వీ యూనివర్సిటీ, జాతీయ సంస్కృత యూనివర్సిటీ నుండి తెచ్చిన వేలాది తాళపత్ర గ్రంథాలను స్కాన్ చేసి వాటిని స్కాలర్స్ ద్వారా గ్రంథీకరణ చేయాలన్నారు. ఇందులో సమాజానికి బాగా ఉపయోగపడే వాటిని ఎంపిక చేసి పుస్తకరూపంలో అందుబాటులోకి తేవాలని ఈవో సూచించారు. తాళపత్ర గ్రంథాలకు సంబంధించిన వివరణాత్మక క్యాటలాగ్స్ తయారు చేయాలని ఆయన చెప్పారు. స్కాన్ చేసిన తాళపత్రాలన్నీ సర్వర్ లో నిక్షిప్తం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. తాళపత్ర గ్రంథాలను భద్రపరచడానికి సనాతన జీవన ట్రస్ట్ ఆర్ధిక సహకారంతో వేదవిశ్వవిద్యాలయంలో ఒక భవనం నిర్మించేలా ఏర్పాటు చేయాలన్నారు. వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఇకపై ఈ ప్రాజెక్టుకు డైరెక్టరుగా వ్యవహరిస్తారని ఈవో చెప్పారు..
జేఈవో సదా భార్గవి, విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య రాణి సదాశివ మూర్తి, సనాతన జీవన ట్రస్ట్ అధ్యక్ష్యులు
శశిధర్, మ్యాన్ స్క్రిప్ట్ ప్రాజెక్టు డిప్యూటీ ఈవో విజయలక్ష్మి, విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య రాధేశ్యాం సమీక్షలో పాల్గొన్నారు










