పోలీసులకు చిక్కిన మహా సైబర్ నేరగాడు
- 40 బ్యాంక్ ఖాతాలు సీజ్
- రూ.1.5 కోట్ల నగదు స్వాధీనం
ముంబయి: పన్నెండో తరగతి చదివి.. సైబర్ నేరాల బాట పట్టి.. దేశవ్యాప్తంగా వేలమంది అమాయక ప్రజలను.. ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా పెట్టుకొని దోచుకుంటున్న నేరగాడిని ముంబయి పోలీసులు అదుపులో తీసుకున్నారు. నిందితుడి పేరు దాడి శ్రీనివాసరావు (49). పన్నెండో తరగతి వరకే చదివినా.. సైబర్ నేరాల్లో ఆరితేరిపోయాడు. రోజుకు రూ.5 కోట్లకు పైగా మోసాలకు పాల్పడుతున్నాడు. హైదరాబాద్‌లోని ఓ హోటల్ నుంచి ఈ క్రిమినల్‌ను.. బాంగుర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాలోని మరో నలుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఇద్దరు ఠాణెకు చెందిన వారు. మిగతా ఇద్దరు కోల్‌కతావాసులు. దాడి శ్రీనివాసరావు టెలిగ్రామ్ యాప్‌తోనే ఎవరితోనైనా సంప్రదింపులు జరుపుతాడు. ఇప్పటివరకు దాడి లావాదేవీలు జరుపుతున్న 40 బ్యాంకు ఖాతాలను పోలీసులు సీజ్ చేశారు. రూ.1.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.
- దాడి.. దోచుకునేదిలా..
ఈ సైబర్ ముఠా ఎక్కువ శాతం మహిళలనే లక్ష్యంగా చేసుకుంటోంది. పోలీసు అధికారులమంటూ ఫోన్ చేసి.. మీరు పంపిన కొరియర్లో మాదకద్రవ్యాలు లేదా ఆయుధాలు దొరికాయని బెదిరిస్తారు. కొరియర్ మీది కాదని నిరూపించుకోవాలంటే తక్షణం బ్యాంకు లేదా ఆదాయపుపన్ను వివరాలు పంపాలని ఆదేశిస్తారు. వాటిని తనిఖీ చేసి ఆ కొరియర్‌తో సంబంధం ఉందో లేదో తేలుస్తామని అంటారు. దీంతో చాలా మంది ఆ వివరాలను పంపిస్తున్నారు. ఓటీపీని కూడా పంచుకుంటున్నారు. అంతేకాదు.. ఎనీడెస్క్ లాంటి యాప్‌లను ఉపయోగించుకొని బాధితుల ఫోన్లను ఈ ముఠా తమ నియంత్రణలోకి తీసుకుంటోంది. బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తోంది. వీరి చేతిలో దేశవ్యాప్తంగా వేలమంది మోసపోయారు. దోచుకున్న సొమ్మంతా దాడి నిర్వహిస్తున్న ఖాతాల్లోకి వెళుతుంది. ఈ ఖాతాల్లో రోజుకు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు లావాదేవీలు జరుగుతున్నాయి. బ్యాంకు ఖాతాల్లోకి చేరిన నగదును దాడి.. క్రిప్టోకరెన్సీలోకి మారుస్తున్నాడు. ఆ క్రిప్టో మొత్తాలను ఓ చైనా జాతీయుడి ఖాతాకు బదిలీ చేస్తున్నాడు.