AP NEWS

ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణ బిల్లును ప్రవేశపెట్టిన పేర్ని నాని

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణ బిల్లును రాష్ట్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి పేర్ని నాని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సవరణ బిల్లు తీరుతెన్నులను వివరించారు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకే షోలు ప్రదర్శించాల్సి ఉంటుందని, టికెట్ల ధరలు కూడా ప్రభుత్వ నియమనిబంధనలకు లోబడి ఉంటాయని స్పష్టం చేశారు. సినిమా టికెట్లను ఆన్ లైన్ లో కొనుగోలు చేయవచ్చని వెల్లడించారు.

ఇప్పటివరకు ఉన్న పరిస్థితుల్లో మార్పు తీసుకువస్తామని అన్నారు. రోజుకు 4 షోలు వేయాల్సిన చోట ఇష్టం వచ్చినట్టుగా ఆరు, ఏడు షోలు వేసుకుంటున్నారని ఆరోపించారు. బెనిఫిట్ షోల సమయంలో మరీ దారుణంగా ఒక్కో టికెట్ రూ.1000 వరకు విక్రయిస్తున్నారని తెలిపారు.

సినిమాటోగ్రఫీ చట్టాన్ని కూడా లెక్కచేయని పరిస్థితులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. చట్టం తమను ఏమీ చేయలేదని కొందరి భావిస్తుంటే, మరికొందరు తమకు అనుకూలంగా చట్టం ఉండాలని కోరుకుటున్నారని వివరించారు. ఇకపై ఆన్ లైన్ టికెటింగ్ విధానం అమల్లోకి వస్తుందని, తద్వారా అవకతవకలకు అడ్డుకట్ట పడుతుందని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.