చంద్రగిరి మండలంలోని మాజీ మిలిటరీ ఉద్యోగులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్రాంతి ఉద్యోగుల సంఘం సభ్యులు ఒక్కటై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిని సన్మానించేందుకు ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు చంద్రగిరి ఎమ్మెల్యే చంద్రగిరి టౌన్‌లోని స్టేట్ బ్యాంక్ (మెయిన్ బ్రాంచ్) ముందర వున్న విశ్రాంతి ఉద్యోగులు ఎర్పాటు చేసిన ఆత్మీయ సమావేశ సభకు చేరుకున్నారు. సభా ప్రాంగణానికి చేరుకున్న ఎమ్మెల్యే పులివర్తి నానిని మంగళ వాయిద్యాలతో పండితుల మంత్రోచ్ఛారణతో పూర్ణకుంభంతో విశ్రాంతి ఉద్యోగులు ఆహ్వానం పలికారు. వినాయక స్వామి గుడి వద్ద పూజలు నిర్వహించి ఆత్మీయ సమావేశ సభ ప్రారంభించారు. పలువురు విశ్రాంతి ఉద్యోగులు ప్రసంగించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ అనుభవం కలిగిన పెద్దలు నన్ను సన్మానించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. విశ్రాంతి ఉద్యోగులు అడిగిన సమస్యలపై స్పందించి అస్తవ్యస్తంగా ఉన్న రహదారులను గెలిచిన వారం నుండి పది రోజులలోపే ప్రారంభించి పూర్తి చేయడం కూడా జరుగుతున్నదని తెలిపారు. మా కార్యకర్తలు భాస్కర్, భాను లు మృతి చెందినప్పుడు స్మశాన వాటిక పరిస్థితి చూసి ఆరోజే గోవింద దామము ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నానని అందులో భాగంగానే గెలిచిన పది రోజులలోపే గోవిందధామంకు స్థలం పరిశీలించడం, ప్రస్తుతం జెసిబిలతో క్లీన్ చేయడం జరుగుతున్నదని ఆయన తెలిపారు. చంద్రగిరి విస్తరణ చెందినప్పటికీ 30 సంవత్సరాలగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోకపోవడం బాధాకరం. చంద్రగిరి నూరు జంక్షన్ నుంచి శ్రీనివాస మంగాపురం వరకు 80 నుండి 100 అడుగుల రోడ్డు విస్తరింప చేయాలని, గోవిందుని భక్తులకు విశ్రాంతి షెడ్డు లు ఏర్పాటు చేయాలని ఇప్పటికే అధికారులతో చర్చించినట్లు తెలిపారు. చంద్రగిరిలో కొరకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. మాజీ మిలిటరీ ఉద్యోగులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్రాంతి ఉద్యోగుల సంఘం సభ్యులు అడిగిన సమస్యలను దగ్గరుండి అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానన్నారు. విశ్రాంతి ఉద్యోగులు ఒక్కొక్కరుగా ఎమ్మెల్యే పులివర్తి నాని ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి మండల విశ్రాంతి ఉద్యోగులు, ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఇతరులు పాల్గొన్నారు.










