అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు పాకిస్థాన్ పౌరులను పోలీసులు గుర్తించారు. సౌదీలో పాకిస్థాన్ జాతీయుడిని గులాబ్జాన్ అనే మహిళ పెళ్లి చేసుకుంది. సౌదీలో ఆమె ఐదుగురికి, భారత్‌లో ఒకరికి జన్మనిచ్చింది. ఈ క్రమంలో రెసిడెన్స్ వీసాపై వచ్చి మదనపల్లెలో 20 ఏళ్లుగా ఉంటోంది. ఈ మేరకు గులాబ్ జాన్ కుటుంబం దేశం వదిలి వెళ్లాలంటూ మదనపల్లె పోలీసులు నోటీసులిచ్చారు.
అసలేం జరిగిందంటే : ఈనెల 22న జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గాంలో ముష్కరులు జరిపిన కాల్పుల్లో 26 మంది పర్యాటకులు మరణించారు. పదుల సంఖ్యలో సందర్శకులు గాయపడ్డారు. ఈ ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలో ఉన్న పాకిస్థాన్ పౌరులు వారి స్వదేశానికి వెళ్లిపోవాలని భారత ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని రాష్ట్రాలు ఆ దిశగా చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో 21 మంది పాకిస్థాన్ జాతీయుల్ని పోలీసులు నిర్ధారించారు. వీరిలో 15 మంది నిర్దేశిత గడువు మేరకు ఇవాళ దేశం విడిచి వెళ్లిపోనున్నారు. మిగతా ఆరుగురు అత్యవసర వైద్య సేవల నిమిత్తం మెడికల్ వీసా మీద వచ్చినందున 29లోగా వాళ్లూ వెళ్లిపోతారని పోలీసు వర్గాలు తెలిపాయి. తాజాగా ఇవాళ ఐదుగురిని మదనపల్లె పోలీసులు గుర్తించారు.