అల్లూరి జిల్లా : బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవ ధీరుడు, మన్యం వీరుడు కామ్రేడ్ అల్లూరి సీతారామరాజు 128వ జయంతి వేడుకలు అల్లూరి జిల్లా కృష్ణదేవిపేటలో గల అల్లూరి పార్కులో ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు ఎస్. ధర్మాన పడాల్, ప్రధాన కార్యదర్శి పి. బాల్దేవ్ మాట్లాడుతూ, “అల్లూరి సీతారామరాజు మన్యం తుర్పు ముఠా కనుమలను కేంద్రంగా చేసుకొని స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనడం మాకు గర్వకారణం. అలాంటి గడ్డపై ఆదివాసులు జన్మించడం ఆనందంగా ఉంది. అల్లూరి ఉద్యమం మాకు స్ఫూర్తి ప్రదాత. బ్రిటిష్ పాలనను వ్యతిరేకించిన అల్లూరి ధైర్యసాహసం, ఇప్పుడు స్వదేశీ పాలకుల కుట్రలకు వ్యతిరేకంగా పోరాటానికి మార్గదర్శకం కావాలి” అని అన్నారు.
తాజాగా స్వదేశీ పాలకులు ఆదివాసులపై వివిధ మార్గాలలో దాడులు చేస్తున్నారని, జి.ఓ నెం.3 రద్దు, హైడ్రో పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుతో పాటు గిరిజన పోడు రైతులపై అక్రమ కేసులు నమోదు వంటి చర్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. బాక్సైట్ గనులపై కూడా ప్రభుత్వం కన్నేసిందని, ఇది ఆదివాసుల హక్కులపై దాడిగా పేర్కొన్నారు.
“ఇలాంటి పరిస్థితుల్లో అల్లూరి ఉద్యమాలను ఆదర్శంగా తీసుకొని, గిరిజన హక్కుల పరిరక్షణకు ఆదివాసి గిరిజన సంఘం అల్లూరి జిల్లా కమిటీ నిరంతరం ఉద్యమాలు కొనసాగిస్తుంది” అని వారు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు టి. కృష్ణరావు, టి. సూర్యనారాయణతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
జయంతి వేడుకలు పాశుపతికంగా నిర్వహించబడిన ఈ సందర్భంగా, అల్లూరి సీతారామరాజు ధైర్యం, త్యాగం, ఉద్యమ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు పిలుపునిచ్చారు