- ఒకేచోట అధికంగా డంపు చేసిన టేకు కలప
- అధికారుల చేతివాటం ఉందనే అనుమానం…!
- పర్యవేక్షణ అవసరం కానీ ఇక్కడ కరువు
మహబూబాబాద్ జిల్లా: గంగారం మండలంలో రామారంలో యథేచ్ఛగా కలప, టేకు అక్రమ తరలింపు జరుగుతున్న కూడా అటవీ అధికారులు ఇప్పటివరకు మండలంలో తనిఖీలు చేసి టేకు కలపని పట్టుకున్న దాఖలాలు అయితే లేవు.తనిఖీలు చేపట్టకపోవడం పై అటవీ అధికారులపై అనుమానాలు మండలంలో తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. అక్రమ కలప తరలింపుల విషయం అటవీ అధికారులు లంచాలు తీసుకుని వీరి కనుసన్నల్లోనే అక్రమ తరలింపు జరుగుతుందనే విమర్శలు వచ్చిపడుతున్నాయి.
అటవీశాఖ అధికారులు మామూళ్లు వసూలు చేస్తు కలపను అక్రమంగా తరలించడంలో పాత్ర వహిస్తున్నారని వ్యాపారులే బహిరంగంగా చెబుతున్నారు. చేయి తడిపితే ఎటువంటి ఇబ్బంది ఉండదని, లేనిపక్షంలో వేలకు వేలు అపరాధ రుసుం వేసి ట్రాక్టర్‌ను సీజ్ చేస్తామని అంటున్నారని వారు వాపోయారు. అటవీ అధికారులు నిర్లక్ష్యం వీడి మండలం లో నిల్వలు ఉన్న కలప డంప్ లపై తనిఖీలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.అలాగే మండలం లో ఉన్న కట్టె కోత సామిల్ లలో కూడా భారీగా కలప నిల్వ ఉన్నట్లు వినికిడి.వీటిపై కూడా క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది.
పర్యవేక్షణ అవసరం కానీ ఇక్కడ కరువు
అక్రమ నిల్వలపై అటవీ శాఖ అధికారులతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం నిత్యం పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. గంగారం ఫారెస్ట్ రేంజ్ కొత్తగా ఏర్పడిన తర్వాత నాటి నుంచి ఈ విభాగం ఉనికి జిల్లాలో తగ్గినట్లుగా కనిపిస్తోంది. గతంలో మిల్లులు, టింబర్ డిపోలు, అక్రమంగా నిల్వ చేసిన కలప స్థావరాలపై క్రమం తప్పకుండా దాడులు జరిగేవి. ఈ నేపథ్యంలో తనిఖీలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది.