యూట్యూబ్: ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ తన ట్రెండింగ్ పేజీని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. 2015లో ప్రారంభమైన ఈ ట్రెండింగ్ పేజీ, వైరల్ వీడియోలు, బ్రేకింగ్ న్యూస్, మరియు టాప్ మ్యూజిక్ రిలీజ్‌లను హైలైట్ చేసేందుకు ఒక కేంద్ర స్థానంగా ఉండేది. దాదాపు దశాబ్ద కాలం పాటు వినియోగదారులకు ట్రెండింగ్ కంటెంట్‌ను అందించిన ఈ ఫీచర్ కు జూలై 21 నుంచి అధికారికంగా వీడ్కోలు పలకనున్నారు. ఈ నిర్ణయం వినియోగదారుల వీక్షణ అలవాట్లలో వచ్చిన మార్పులు మరియు ప్లాట్‌ఫామ్ యొక్క అభివృద్ధికి అనుగుణంగా తీసుకున్నామని యూట్యూబ్ వెల్లడించింది.
యూట్యూబ్ ట్రెండింగ్ పేజీ ఒకప్పుడు యూజర్లకు ప్లాట్ఫామ్లో జనాదరణ పొందిన కంటెంట్‌ను తెలుసుకునేందుకు ఓ మెయిన్ డెస్టినేషన్ గా ఉండేది. ఈ పేజీలో వీడియోలు అన్ని వర్గాల నుంచి, ముఖ్యంగా హై క్లిక్ రేట్‌తో ఉన్నవి పొందుపరిచేవారు. అయితే, గత కొన్ని సంవత్సరాలలో వినియోగదారుల అలవాట్లు మారాయి. యూట్యూబ్ అధునాతన రికమెండేషన్ అల్గారిథమ్‌లు హోమ్పేజీల ద్వారా ట్రెండింగ్ కంటెంట్‌ను నేరుగా అందిస్తున్నాయి, దీంతో ట్రెండింగ్ పేజీ యొక్క అవసరం తగ్గిపోయింది. వినియోగదారులు ఇప్పుడు షార్ట్స్, కమ్యూనిటీ పోస్ట్‌లు, మరియు సెర్చ్ సజెషన్స్ ద్వారా ట్రెండ్లను కనుగొంటున్నారు.
ఈ నేపథ్యంలో ట్రెండింగ్ పేజీ స్థానంలో, యూట్యూబ్ చార్ట్స్ మరియు కస్టమైజ్ చేసిన రికమెండేషన్లపై దృష్టి సారించనుంది. ఈ చార్ట్స్ విభాగాల వారీగా ట్రెండింగ్ కంటెంట్‌ను అందిస్తాయి. ఇది వినియోగదారులకు మరింత నిర్దిష్టమైన కంటెంట్ డిస్కవరీ అనుభవాన్ని అందిస్తుంది. అదనంగా, క్రియేటర్లకు సహాయం చేసేందుకు యూట్యూబ్ స్టూడియోలోని ఇన్స్పిరేషన్ ట్యాబ్ వంటి ఫీచర్లు కొనసాగుతాయి. ఇవి కొత్త ట్రెండ్లను గుర్తించడంలో సహాయపడతాయి. కొత్త క్రియేటర్లను ప్రోత్సహించేందుకు ‘హైప్’ ఫీచర్ వంటి కొత్త టూల్స్‌ను కూడా యూట్యూబ్ పరిచయం చేస్తోంది.