శ్రీసత్యసాయి జిల్లా : ముదిగుబ్బలో వ్యక్తి దారుణ హత్యకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. సొంత అల్లుడినే మామ సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తనకల్లు మండలం ఎర్రగుంటపల్లికి చెందిన బుగుడే విశ్వనాథ్‌కు 20 ఏళ్ల క్రితం ఓడిచెరువు మండలం గాజుకుంటపల్లికి చెందిన బెట్టకుండ వెంకట రమణ అలియాస్ రమణ పెద్ద కుమార్తె శ్యామలతో వివాహం జరిగింది.
మొదట్లో వీరి సంసారం బాగానే సాగింది. కానీ ఆ తర్వాత విశ్వనాథ్ అటు భార్య చెల్లెలు మరదలుతో, అత్తతోనూ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో అత్త పేరిట ఉన్న ఓడిచెరువు మండలం గాజుకుంటపల్లిలో ఉన్న విలువైన భూములను విశ్వనాథ్ ఎవరికీ తెలియకుండా అమ్ముకున్నాడు. తన కుమారుడికి దక్కాల్సిన ఆస్తిని అల్లుడు విశ్వనాథ్ అమ్ముకోవడంతో పాటు తన కుటుంబంలో, తన చిన్న కుమార్తె కుటుంబంలో అలజడి రేపుతున్నాడని రమణ కోపం పెంచుకున్నాడు.
అల్లుడిని ఎలాగైనా అంతమొందించాలని రమణ నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని తన స్నేహితుడైన గాజుకుంటపల్లికి చెందిన రమణప్పకు చెప్పాడు. రమణప్పకు కొంత డబ్బులు ఇవ్వాల్సి ఉండగా, ఆ డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదని, మరో రెండు లక్షలు ఇస్తానని తన అల్లుడు విశ్వనాథ్‌ను హత్య చేయాలని చెప్పాడు. దీంతో రమణప్ప ఆటో డ్రైవర్లు కమతం రామకృష్ణ, మధుబాబులతో మాట్లాడి విశ్వనాథ్ హత్యకు పథకం వేశారు. మందు పార్టీ ఇస్తామంటూ ఈ ముగ్గురూ ఈ నెల 1వ తేదీన విశ్వనాథ్‌ను పథకం ప్రకారం ముదిగుబ్బ శివారులోని బైపాస్ రోడ్డు దగ్గర గల అటవీ ప్రాంతానికి పిలిపించారు.
విశ్వనాథ్ తన బైక్‌పై అక్కడికి రాగా, అందరూ కలిసి మద్యం తాగారు. విశ్వనాథ్ మద్యం మత్తులోకి జారుకున్న తర్వాత వారు తమ వెంట ఆటోలో తెచ్చుకున్న వేట కొడవళ్లతో ఒక్కసారిగా తలను నరికారు. దీంతో ఒక్కసారిగా తల, మొండెం వేరయ్యాయి. ఆ తర్వాత తలను దూరంగా పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ హత్యపై పోలీసులు విచారణ జరపగా ఈ షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా అల్లుడిని మామే సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లుగా వెల్లడైంది. నిందితులను అరెస్టు చేసి కదిరి కోర్టులో హాజరుపర్చి, జైలుకు తరలించినట్లు ధర్మవరం డీఎస్పీ హేమంత్ కుమార్ మీడియాకు తెలిపారు.