contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

సీఐ శ్రీలతపై కేసు నమోదు

కరీంనగర్‌, విద్యానగర్‌: కరీంనగర్‌ మహిళా పోలీస్‌ స్టేషన్‌ సీఐ తనపై అక్రమంగా కేసులు పెట్టి మానసికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఓ రెవెన్యూ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఐతోపాటు తన భార్య, అత్త, మరికొందరి కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియో తీసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. చొప్పదండికి చెందిన కడారి శ్రవణ్‌కుమార్‌ (34) కరీంనగర్‌ రూరల్‌ తహసీల్‌ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు కరీంనగర్‌లోని సవరన్‌స్ట్రీట్‌కు చెందిన ఆర్టీసీ కండక్టర్‌ బత్తుల నీలిమతో 2021లో రెండో వివా హం జరిగింది. నీలిమకు కూడా రెండో వివాహమే. వీరికి నాలుగేండ్ల కూతురు ఉన్నది. ఇద్దరి మధ్య గొడవ కారణంగా మే 8న నీలిమ కరీంనగర్‌ మహిళా పోలీస్‌ స్టేషన్‌లో శ్రవణ్‌కుమార్‌పై ఫిర్యాదు చేయగా, సీఐ శ్రీలత అదే నెల 10న పిలిచి కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

అదే నెల 17న విడాకుల కోసం కూర్చుండి మాట్లాడుకుంటామని చెప్పడంతో కేసు క్లోజ్‌ చేసినట్టు సీఐ తెలిపారు. ఆ తర్వాత నీలిమ.. తనను ఆర్టీసీ బస్టాండ్‌లో, ఇంటి వద్ద కొట్టాడని శ్రవణ్‌కుమార్‌పై మరోసారి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఈక్రమంలో ఈనెల 7న చొప్పదండిలోని తన ఇంట్లో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గుర్తించి అతడిని కరీంనగర్‌లోని ప్రైవేట్‌ దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. కాగా, సీఐ శ్రీలత, బత్తుల నీలిమ, ప్రవీణ్‌కుమార్‌, నవీన్‌కుమార్‌, ఎడ్ల ప్రసన్న, బత్తుల వినోద్‌, బత్తుల మధుకుమార్‌ వేధింపుల కారణంగానే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని శ్రవణ్‌కుమార్‌ తండ్రి నర్సింగం చొప్పదండి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పలువురిపై కేసు నమోదైంది.

సెల్ఫీ వీడియోలో సీఐపై ఆరోపణలు..
సెల్ఫీ వీడియో సారాంశం ఇలా.. ‘సీపీ గారు.. మీ కాళ్లు మొక్కుతా. మహిళా పోలీస్‌ స్టేషన్‌ సీఐని జాబ్‌ నుంచి తీసేయండి. వాళ్ల దగ్గర లంచం తీసుకుని నా మీద కేసు పెట్టారు. మే 17న సీఐ గారే పంచాయితీ చేశా రు. నాతో బలవంతంగా విడాకులపై సంతకం చేయించారు. నా బిడ్డను కూడా చూడనివ్వలేదు. నా చావుకు సీఐ శ్రీలత, భార్య నీలిమ, అత్త వినోద, ప్రవీణ్‌, వాళ్ల అన్న ప్రసన్న కుమార్‌ కారణం. సీఐ నన్ను గలీజ్‌గా తిట్టారు. అని శ్రవణ్‌కుమార్‌ తన సెల్ఫీ వీడియోలో రికార్డు చేశాడు.

నాకు సంబంధం లేదు : సీఐ
శ్రవణ్‌కుమార్‌ ఆత్మహత్య విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని కరీంనగర్‌ మహిళా పోలీస్‌స్టేషన్‌ సీఐ శ్రీలత స్పష్టంచేశారు. శ్రవణ్‌కుమార్‌ తన సెల్ఫీ వీడియోలో చేసిన ఆరోపణలపై ఆమెను వివరణ కోరగా, తాను అతన్ని ఏ రకంగానూ వేధించలేదని పేర్కొన్నారు.

చొప్పదండి శ్రావణ్ ఆత్మహత్య.. కేసు వివరాలు వెల్లడించిన ఎస్ఐ నరేష్ రెడ్డి

కరీంనగర్ జిల్లా: చొప్పదండి కి చెందిన కడారి శ్రవణ్ కుమార్ , కరీంనగర్ రురల్ ఎమ్మార్వో ఆఫీస్ లో రికార్డు అసిస్టెంట్ గా పని చేస్తుంటాడు. కరీంనగర్ కి చెందిన అతని భార్య కడారి నీలిమ , కరీంనగర్ డిపో నందు కండక్టర్ గా పని చేస్తుంది.గత మే నెలలో శ్రవణ్ భార్య కరీంనగర్ మహిళా స్టేషన్లో అతని భర్త శ్రవణ్, అత్త మామలు మరియు అక్క వనజ లపై గృహహింస మరియు వరకట్న వేధింపుల కేసు నమోదు చేసింది.

ఇట్టి కేసు విచారణలో భాగంగా శ్రావణ్ ను పోలీస్ స్టేషన్ కి పిలవగా మనస్తాపానికి గురైన శ్రావణ్ ఈ నెల 7వ తేదీన చొప్పదండి లో పురుగుల మందు తాగి కరీంనగర్ లోని ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి తండ్రి కడారి నర్సింగము పిర్యాదు మేరకు మృతుని భార్య నీలిమ, ఆమె తల్లి, ఆమె తరపున స్టేషన్ కి వచ్చిన మధ్యవర్తులతో పాటు మహిళా పీఎస్ ఇన్స్పెక్టర్ పై కేసు నమోదు చేసినట్లు చొప్పదండి ఎస్ఐ నరేష్ రెడ్డి తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :