contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ద్వేషపూరిత ప్రసంగాలను నియంత్రించండి .. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నిర్దేశం

భావ ప్రకటన స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలిగించకుండానే, ద్వేషపూరిత ప్రసంగాలను నియంత్రించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు నిర్దేశించింది. సోషల్ మీడియా ఇన్​ఫ్లూయెన్సర్​ శర్మిష్ఠ పనోలిపై వజాహత్ ఖాన్​ దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది.

ద్వేషపూరిత ప్రసంగాన్ని “భావ ప్రకటన స్వేచ్ఛ”గా భావిస్తుండడం విచారకరమని జస్టిస్​ బీవీ నాగరత్న, జస్టిస్​ కేవీ విశ్వనాథన్​ ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. వాక్ స్వాతంత్య్రం విలువ గురించి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించింది.

“విద్వేషపూరిత ప్రసంగాలు చేసే వారికి అవి ఎంత అసభ్యకరంగా, అనుచితంగా ఉంటున్నాయో ఎందుకు అర్థం కావట్లేదు? వాస్తవానికి ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలను షేర్‌ చేయకుండా కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ద్వేషపూరిత ప్రసంగాలను షేర్ చేయడం, లైక్ చేయడం లాంటివి చేయకుండా తమను తాము నియంత్రించుకోవాలి. మేము సెన్సార్‌షిప్‌ గురించి మాట్లాడడం లేదు. కానీ, ప్రజలు ఇలాంటి అంశాలపై ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాలో విస్తరిస్తున్న ఈ విభజన ధోరణిని అడ్డుకోవాల్సిందే” అని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అంతేకాదు “ఇటువంటి కేసుల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని ఎవరూ కోరుకోరు. కానీ వాక్ స్వాతంత్ర్యంపై బాధ్యతాయుత ఆంక్షలు సరైనవే. వాక్‌ స్వాతంత్ర్యం, భావ వ్యవక్తీకరణ విలువలను ప్రజలు అర్థం చేసుకోవాలి” అని సుప్రీంకోర్టు పేర్కొంది.

మత ద్వేషాల్ని రెచ్చగొట్టే విధంగా పోస్టులు
సోషల్ మీడియాలో ద్వేషపూరిత, మత విద్వేషాలను రెచ్చగొట్టే కంటెంట్​ను పోస్ట్ చేశారనే ఆరోపణలపై వజాహత్ ఖాన్​పై వివిధ రాష్ట్రాల్లో కేసులు నమోదు అయ్యాయి. అయితే అంతకంటే ముందే, అతను ఒక ఎఫ్​ఐఆర్​లో పోలీసు కస్టడీలో ఉన్నట్లు, మరొక ఎఫ్​ఐఆర్​లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నట్లు ఉంది. ఈ రెండూ పశ్చిమ బెంగాల్​లోనే నమోదు కావడం గమనార్హం. తరువాత ఆ రాష్ట్రం వెలుపల నమోదైన ఓ కేసులో వజాహత్​ ఖాన్​ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ అరెస్టును సుప్రీంకోర్టు నిలిపివేసింది.

ఈ నేపథ్యంలో వజాహత్ ఖాన్​ తనపై దాఖలైన అన్ని కేసులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. వాజాహత్​ ఖాన్ గతంలో తాను చేసిన ట్వీట్లకు క్షమాపణలు చెప్పినట్లు ఆయన తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలియజేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా, ద్వేషపూరిత ప్రసంగాలను, పోస్టులను నియంత్రించే మార్గాలను సూచించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, వజాహత్ ఖాన్ తరఫున హాజరైన న్యాయవాదిని సర్వోన్నత న్యాయస్థానం కోరింది. అంతేకాదు వజాహత్ ఖాన్​కు ఉపశమనం కల్పిస్తూ, ‘ఒక వ్యక్తిపై పలు ఎఫ్​ఐఆర్​లు నమోదు చేసి, అతనిని జైలులో పెట్టడం వల్ల ప్రయోజనం ఏమిటి?’ అని ప్రశ్నించింది.

ఓకే వ్యక్తిపై బోలెడు ఎఫ్​ఐఆర్​లు ఎందుకు?
ఈ కేసుపై జూన్​ 24న చేసిన విచారణ సందర్భంగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విశ్వనాథన్, ఎన్​. కోటీశ్వర్ సింగ్​లతో కూడిన ధర్మాసనం కేంద్రంతో సహా అసోం, దిల్లీ, హరియాణా, పశ్చిమ బెంగాల్​ రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. వివిధ రాష్ట్రాల్లో తనపై నమోదైన ఎఫ్​ఐఆర్​లను ఏకీకృతం చేయాలని కోరుతూ వజాహత్ ఖాన్​ చేసిన పిటిషన్​పై స్పందించాలని కోరింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :