పార్వతీపురం మన్యం జిల్లా : సాలూరు నియోజకవర్గం పరిధిలోని పాచిపెంట మండలంలోని కేసలి గ్రామంలో “ఇంటింటికి తెలుగుదేశం – సుపరిపాలనలో తొలిఅడుగు 4.1” కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు గుమ్మిడి సంధ్యారాణి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రివర్యులు గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించి, ప్రజలతో ప్రత్యక్షంగా సంభాషించారు. వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకొని వాటిని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. ప్రజల అభిప్రాయాలను ఓ నాయకురాలిగా శ్రద్ధగా విన్న మంత్రివర్యులు, “ప్రభుత్వ పథకాలు వేగంగా, పారదర్శకంగా ప్రజల దాకా చేరేలా చర్యలు తీసుకుంటాం” అని హామీ ఇచ్చారు.
మంత్రివర్యులు మాట్లాడుతూ, “ప్రజల పట్ల కూటమి ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోంది. గ్రామాల అభివృద్ధే మా ప్రభుత్వ ధ్యేయం. విద్య, వైద్యం, రవాణా, తాగునీరు, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని సాధికారత వైపు నడిపించేందుకు కృషి చేస్తున్నాం” అని తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని పాదయాత్ర నిర్వహించారు. మేళతాళాలతో, పూలదండలు, పసుపు కుంకుమలతో గ్రామస్థులు మంత్రిని ఘనంగా స్వాగతించారు. పాదయాత్ర ప్రజల మద్దతుతో ప్రజా ప్రభంజనం లా మారింది.
ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయనీ, సమగ్ర అభివృద్ధి సాధనకు ఇది నాంది పలికిందని నేతలు పేర్కొన్నారు.