కరీంనగర్ జిల్లా: అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగ కల్పన కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం గన్నేరువరం మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో మండలానికి సంబంధించిన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందించడమే కాకుండా నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ పాలకులు దోచుకో,దాచుకో చందంగా వ్యవహరిస్తూ ప్రజల అవసరాలను ఏ మాత్రం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేయలేని అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల్లోనే చేసి చూపించిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల లబ్ధి పొందేందుకు, ఇతర ప్రయోజనాలు పొందేందుకు అవసరమైన రేషన్ కార్డులను పదేళ్ల కాలంలో ఇవ్వకుండా బీఆర్ఎస్ పాలకులు ప్రజలకు అన్యాయం చేశారన్నారు. ఎంతో ప్రాధాన్యతను గుర్తించే రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేపట్టిందని ఆయన వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 2.4 లక్షల కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరుగుతుందని, దీని ద్వారా 11.30 లక్షల మందికి ప్రయోజనం చేకూరనున్నదని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి తెలిపారు.గన్నేరువరం మండలానికి కార్డులు, రెండో దఫాలో 446 కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయని, వాటిని ఇప్పుడు పంపిణీ చేస్తు్న్నట్టు ఎమ్మెల్యే వివరించారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంటుందని, అర్హులైన వారందరికీ రేషన్ కార్డు అందుతుందని, కార్డు రాలేదని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కొత్త రేషన్ కార్డులు తీసుకున్న మహిళలు ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ రెవెన్యూ డివిజనల్ అధికారి మహేశ్వర్,తహసీల్దార్ ఇప్ప నరేందర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి,రాష్ట్ర యత్ నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి,జిల్లా నాయకులు కొమ్మేర రవీందర్ రెడ్డి,ఎస్సి సెల్ మండల అధ్యక్షుడు మంతగి అనిల్, గ్రామ శాఖ అధ్యక్షుడు చింతల శ్రీధర్ రెడ్డి,రెవెన్యూ అధికారులు ఆర్ఐ రజినీకాంత్,మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.
