కరీంనగర్ జిల్లా: కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం ఐపీఎస్ గురువారం వీణవంక పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జమ్మికుంట రూరల్ ఇన్స్పెక్టర్ కె. లక్ష్మీనారాయణ మరియు వీణవంక పోలీస్ స్టేషన్ ఎస్సై ఆవుల తిరుపతి కమీషనర్‌కు పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు. కమీషనర్ సాయుధ దళ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. అంతేకాకుండా వీణవంక మండల ప్రాథమిక ఉన్నత పాఠశాల లోని 6 నుండి 10వ తరగతి వరకు గల దాదాపు 40 మంది విద్యార్థులకు పోలీసు తరుపున గొడుగులను అందజేశారు.
కమీషనర్ గౌష్ ఆలం పోలీస్ స్టేషన్ సిబ్బంది పరేడ్‌ను, పరిసరాలను పరిశీలించారు. సిబ్బందికి అందించిన కిట్లను తనిఖీ చేసి, వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలోని స్వాధీనం చేసుకున్న వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
హాజరులో ఉన్న సిబ్బందితో మాట్లాడి, వారికి కేటాయించిన విధులు, రికార్డుల నిర్వహణ, సీసీటీఎన్ఎస్ (CCTNS)లో నమోదైన కేసుల వివరాలను సక్రమంగా పొందుపరచాలని సూచించారు. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా మండల పరిధిలోని రద్దీ ప్రాంతాలు మరియు ముఖ్యమైన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన (10) సీసీ కెమెరాలను పోలీసుస్టేషన్ లో పోలీసు కమీషనర్ ప్రారంభించారు. వాటి ఏర్పాటుకు కృషి చేసినందుకు ఎస్సై ఆవుల తిరుపతిని అభినందించారు.
తెలంగాణ పోలీసులు వినియోగించే సీసీటీఎన్ఎస్ – 2.0, పిటిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ఈ-సమన్ల జారీ, టీఎస్-కాప్, హెచ్‌ఆర్‌ఎంఎస్, ఈ-సాక్ష్య, టెక్ డాటం, ఐరాడ్ దర్పణ్, సీఈఐఆర్, సైబర్ క్రైమ్‌లో ఆర్థిక, ఆర్థికేతర నేరాలు, సీడీఆర్, పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైస్, బాడీ వార్న్ కెమెరాలు వంటి అన్ని రకాల సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లపై పూర్తి స్థాయిలో పట్టు సాధించి, వాటిని రోజువారీ విధుల్లో విరివిగా వినియోగించాలని ఆదేశించారు.
ఎఫ్.ఐ.ఆర్ ఇండెక్స్‌ను పరిశీలించి, పెండింగ్ కేసులపై సమీక్ష జరిపి, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. నమోదైన సైబర్ నేరాల గురించి తెలుసుకొని, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. వీణవంక పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలను సెక్టార్లుగా, సబ్-సెక్టార్లుగా విభజించి, వాటికి గ్రామాల వారీగా పోలీస్ అధికారులను కేటాయించాలని ఆదేశించారు.
నూతనంగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లకు పోలీస్ స్టేషన్‌లో అన్ని రకాల విధులను నేర్చుకోవాలని, రికార్డు నిర్వహణ, సీసీటీఎన్ఎస్, రిసెప్షన్, కోర్టు డ్యూటీ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, బీట్, పెట్రోలింగ్, సమన్లు వంటి విధులను సీనియర్ల ద్వారా తెలుసుకోవాలని సూచించారు. నిజాయితీ, క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరని తెలిపారు.
రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలని, ప్రతి నెలా వారికి సంబంధించిన నూతన సమాచారం ఎప్పటికప్పుడు సేకరించి నమోదు చేసుకోవాలని ఆదేశించారు.
ఈ తనిఖీలో రికార్డుల మెయింటనెన్స్ , పోలీస్ స్టేషన్ పర్యవేక్షణ బాగుందని ఎస్సై ఆవుల తిరుపతి మరియు అతని సిబ్బందిని పోలీస్ కమీషనర్ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో జమ్మికుంట రూరల్ ఇన్స్పెక్టర్ కె.లక్ష్మినారాయణ, ఎస్సై తిరుపతి లతో పాటు ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.