యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు మృతి చెందడం దిగ్భ్రాంతికి గురిచేసింది. వారిని మేకా చక్రధర్ రావు, కాంతారావుగా గుర్తించారు.
ఈ ప్రమాదంలో ఏఎస్పీ కోకా రామ్ ప్రసాద్, డ్రైవర్ నర్సింగరావు తీవ్రంగా గాయపడ్డారు. ఏఎస్పీ రామ్ ప్రసాద్ సీట్ బెల్టు పెట్టుకోవడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్టు తెలుస్తోంది. అయినప్పటికీ ఆయన కాలు విరిగింది. పక్కటెముకలకు బలమైన దెబ్బలు తగిలాయి. డ్రైవర్ నర్సింగరావుకు భుజం ఎముక తొలగినట్టు తెలుస్తోంది.
కాగా, వారు ప్రయాణిస్తున్న స్పార్పియో వాహనం డివైడర్ ను బలంగా డీకొన్నట్టు విజువల్స్ చెబుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది. గత నెలలోనూ ఏపీకి చెందని ఓ ఎస్సై, కానిస్టేబుల్ తెలంగాణ వెళుతూ రోడ్డు ప్రమాదంలో మరణించడం తెలిసిందే. కొన్ని వారాల వ్యవధిలోనే మరో యాక్సిడెంట్ ఘటన జరగడంతో ఏపీ పోలీసు వర్గాల్లో విషాదం నెలకొంది.