గుత్తి, అనంతపురం: గుత్తి పట్టణంలోని షాదీ ఖానాలో సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల కోసం జరుగుతున్న భూసేకరణ మరియు వాటి ప్రభావాలపై “రాష్ట్ర స్థాయి చర్చా వేదిక” ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు దడాల సుబ్బారావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం. కృష్ణమూర్తి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల అభివృద్ధి పేరుతో లక్షల ఎకరాల భూములను బలవంతంగా భూసేకరించడం జరుగుతోందని ఆరోపించారు. ఈ భూములపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వ్యవసాయ కార్మికులకు ఎక్కడా నష్టపరిహారం ఇవ్వలేదని పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలోనే రెండు లక్షల పదిహేడు వేల ఎకరాలు పరిశ్రమల పేరిట భూసేకరణకు గురవుతున్నాయని తెలిపారు.
వారు వెల్లడించిన ప్రధాన డిమాండ్లు:
పరిశ్రమల అభివృద్ధి పేరుతో సోలార్, గాలిమరాల ప్రాజెక్టులకు పేదల భూములను ఆదానీ, అంబానీలకు కట్టబెట్టవద్దు.
2013 భూసేకరణ చట్టాన్ని తప్పనిసరిగా అమలు చేయాలి.
భూములపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వ్యవసాయ కార్మిక కుటుంబాలకు తగిన నష్టపరిహారం ఇవ్వాలి.
భూసేకరణ జరిగే గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి ప్రజాభిప్రాయం తీసుకోవాలి.
18 ఏళ్లు నిండిన ప్రతి వ్యవసాయ కార్మికునికి నెలకు రూ.5000 చొప్పున 30 సంవత్సరాల పాటు భరోసా కల్పించాలి.
రైతుల భూములకు ప్రస్తుత మార్కెట్ ధరకు నాలుగు రెట్లు అధిక ధర చెల్లించాలి.
లీజుకు భూములు తీసుకుంటే 10 సంవత్సరాల లీజు మొత్తాన్ని ముందుగానే చెల్లించాలి.
భూములపై భద్రత కల్పించేలా తిరిగి ఇచ్చే హక్కు పత్రాలు ఇవ్వాలి.
ఈ వేదిక ద్వారా నాయకులు ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తూ, పరిశ్రమల అభివృద్ధి అవసరం ఉన్నా, అది పేదల హక్కులు కాలరాస్తూ జరగకూడదని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, పారదర్శకంగా భూసేకరణ జరగాలని, అభివృద్ధి పేరుతో అన్యాయం జరగవద్దని డిమాండ్ చేశారు.