నిర్మల్ జిల్లా ముథోల్: మద్యం మత్తులో అల్లుడు ఇంట్లో ఒంటరిగా ఉన్న అత్తపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వృద్ధురాలు అని చూడకుండా ఆమెపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. ప్రతిఘటనలో తీవ్రంగా గాయడపడ్డ అత్త (68) ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని ఇంటికి రాగా మళ్లీ అదే తీరు ప్రదర్శించాడు. దాంతో సహనం కోల్పోయిన పెద్దావిడ అల్లుడిని కడతేర్చింది. ఈ ఘటన నిర్మల్ జిల్లా ముథోల్ మండలం తరోడ గ్రామంలో సోమవారం అర్ధరాత్రి జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మహారాష్ట్రలోని హిమాయత్‌నగర్‌కు చెందిన షేక్ నజీం (45) పదేళ్ల క్రితం తన భార్య, కొడుకు, అత్తమ్మతో కలిసి తరోడ గ్రామానికి వలస వచ్చాడు. కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, ఈ మధ్య మద్యానికి బానిసగా మారాడు. తరచూ మద్యం తాగొచ్చి ఇంట్లోని కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడు. ఈ క్రమంలో అతడి భార్య పది రోజుల క్రితం మేస్త్రి పని కోసం కుమారుడితో కలిసి మహారాష్ట్రలోని శివుని గ్రామానికి వెళ్లారు. దీంతో ఇంట్లో అత్త ఒక్కరే ఉన్నారు.
రెండు రోజుల కింద మద్యం తాగి ఇంటికి వచ్చిన నజీం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ప్రతిఘటనలో వృద్ధురాలికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుని ఇంటికి వచ్చారు. సోమవారం అర్ధరాత్రి ఆమెపై నజీం మరోసారి లైంగిక దాడికి యత్నించాడు. దాంతో సహనం కోల్పోయిన ఆమె పక్కనే ఉన్న కర్రతో అతని తలపై బలంగా కొట్టింది. అనంతరం గొంతు నులిమి హత్య చేశారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు.