కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలో రైతులను ఎరువుల కొరత తీవ్రంగా వేధిస్తుందని బిజెపి మండలాధ్యక్షులు తిప్పర్తి నికేష్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం రోజున గన్నేరువరంలో తిప్పర్తి నికేష్ మాట్లాడుతూ ఎరువుల కోసం అన్నదాతలు అరగోస పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందన్నారు. ఎరువులు సకాలంలో అందించడంలో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం చెందిందని ఆయన విమర్శించారు. కొందరు ఎరువులను బ్లాక్ మార్కెట్ చేస్తున్న ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో దళారీలు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. ముఖ్యంగా గన్నేరువరం మండలంలో రైతులు ఎరువుల కోసం రోజుల తరబడి పడిగాపులు కాస్తున్న పట్టించుకునే నాధుడు కరువయ్యారన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల ఎరువుల కష్టాలను తీర్చడానికి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించిందని తెలిపారు. అలాగే సబ్సిడీతో అన్ని రకాల ఎరువులను కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులకు ఎరువులను సకాలంలో అందించడంలో విఫలమైందన్నారు. ఎరువులను బ్లాక్ మార్కెట్ చేసిన దళారులను, కొందరు వ్యాపారస్తులను చూసి చూడనట్టుగా వదిలేయడంతో రెచ్చిపోతున్నారని తెలిపారు. ముఖ్యంగా ఎరువులను బ్లాక్ మార్కెట్లో అత్యధిక ధరలకు అమ్ముతూ రైతులను నిలువ దోపిడీ చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల పైన చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఎరువుల కొరత సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అటికం రామచంద్రం, మచ్చ బాలరాజు,పుల్లెల రాము, నందికొండ సురేందర్ రెడ్డి, కాంతల శ్రీనివాస్ రెడ్డి, స్వామి రెడ్డి, నరసింహస్వామి, తదితరులు పాల్గొన్నారు
