పాకాల, తిరుపతి జిల్లా: పాకాల మండలంలోని గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై పారదర్శకత కొరతతో ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. పనులు పూర్తి కాకముందే బిల్లులు తయారు చేసి, ట్రెజరీ నుంచి భారీగా నగదు విత్‌డ్రా చేసుకుంటూ పంచాయతీ పెద్దలు, సిబ్బంది భాగస్వాములవుతున్నారన్న వదంతుల నేపథ్యంలో, ఈ కార్యక్రమాలపై నిఖార్సైన సమాచారం ప్రజలకు నేరుగా పంపాల్సిన అవసరం ఉందని స్థానికులు భావిస్తున్నారు.
ప్రజల డిమాండ్ ప్రకారం, ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన సమాచారం – పని పేరు, కేటాయించిన మొత్తం, కేంద్ర మరియు రాష్ట్ర వాటా, గుత్తేదారు వివరాలు, పనుల కాలపరిమితి – ఇలా అన్నీ సంక్షిప్తంగా మున్సిపాలిటీ లేదా పంచాయతీ పరిధిలో నివసించే ఓటర్లకు SMS రూపంలో పంపించాలని వారు కోరుతున్నారు.
ప్రస్తుతం టెక్నాలజీ అందుబాటులో ఉన్న పరిస్థితిలో, ఈ విధంగా సమాచారం అందించటం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని ప్రజలు అంటున్నారు:
పారదర్శకత పెరుగుతుంది
అవినీతి అవకాశం తగ్గుతుంది
పనుల నాణ్యత మీద ప్రజల పర్యవేక్షణ పెరుగుతుంది
చేయని పనులకు బిల్లుల చెల్లింపులపై అడ్డుకట్ట పడుతుంది
ఈ విధానాన్ని అనుసరించడం వల్ల, పంచాయతీకి సంబంధించిన అభివృద్ధి పనులపై ప్రజల విశ్వాసం పెరుగుతుందని, అలాగే కేంద్రానికి సమర్పించాల్సిన యూటీలైజేషన్ రిపోర్ట్ తయారీ కూడా సులభతరం అవుతుందని స్థానిక సీనియర్ సిటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఇకపై అభివృద్ధి పనులు పూర్తి పారదర్శకతతో నిర్వహించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు సమాచారం పంచే విధానాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలని పాకాల మండలంలోని మెజారిటీ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.