కరీంనగర్ జిల్లా: రానున్న నాలుగు రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు.
భారీ వర్షాలు, తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో పాటు సంబంధిత అధికారులతో కలెక్టర్ బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ కాన్ఫరెన్స్ లో కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినందున మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు తమ ఫీల్డ్ ఆఫీసర్లు, సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలని అన్నారు. 24 గంటలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అన్నారు. విద్యుత్, రెవెన్యూ, పోలీసు, ఆర్అండ్ బీ, పంచాయితీరాజ్, ఇరిగేషన్ శాఖలను సమన్వయం చేసుకుని ప్రమాదకరంగా ఉండే నాలాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారీ వర్షాల వల్ల జిల్లాలో మనుషులకు గాని పశువులకు గానీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకూడదని తెలిపారు. పాఠశాలలు, హాస్టల్స్తో పాటు శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించి ఖాళీ చేయించాలని, పురాతన భవనాల్లోని సాధారణ పౌరులను కూడా సురక్షిత భవనాలకు తరలించాలన్నారు. ప్రమాదరంగా ఉన్న చెరువులు, ప్రాజెక్టులను పరిశీలించి లీకేజీలు ఉంటే గుర్తించి వెంటనే పరిష్కరించాలని, షార్ట్ సర్క్యూట్ జరగకుండా విద్యుత్ శాఖ అధికారులను అప్రమత్తం చేయాలని అన్నారు. రోడ్లపై విరిగిన చెట్లను అప్పటికప్పుడు తొలగించాలని, భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది పూర్తి స్థాయిలో ఫీల్డ్ లో ఉండాలని కలెక్టర్ తెలిపారు.
◆ కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
భారీ వర్షాల నేపథ్యంలో కరీంనగర్ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.భారీ వర్షాల నేపథ్యంలో సహాయం కోసం 0878 2997247 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలని తెలిపారు. కంట్రోల్ రూమ్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులు తమ తమ కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వర్షాల కారణంగా ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే సమస్యలు పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.










