అనంతపురం జిల్లా తాడిపత్రి : తాడిపత్రిలో మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య సవాళ్లతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాడిపత్రిలోకి ప్రవేశించాలన్న పట్టుదలతో ఉన్న కేతిరెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో, ఆయన ఏకంగా ఆరు గంటలుగా నడిరోడ్డుపైనే కుర్చీ వేసుకుని నిరీక్షిస్తుండటం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
సోమవారం ఉదయం, పోలీసుల సూచనలను పక్కనపెట్టి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎర్రగుంటపల్లి ఫ్లైఓవర్ వద్ద శివుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అదే సమయంలో, హైకోర్టు అనుమతితో తాడిపత్రికి వస్తున్న కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు నాగిరెడ్డిపల్లె వద్ద నిలిపివేశారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని పేర్కొంటూ ఆయనకు అనుమతి నిరాకరించారు. దీంతోపాటు టీడీపీ కార్యకర్తలు కూడా ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
పోలీసుల చర్యతో ఆగ్రహానికి గురైన పెద్దారెడ్డి, అక్కడే రోడ్డుపై కుర్చీ వేసుకుని బైఠాయించారు. తాడిపత్రిలోకి తనను అనుమతించే వరకు కదిలేది లేదని తేల్చిచెప్పారు. ఆరు గంటలకు పైగా అక్కడే ఉండిపోయిన ఆయన, భోజనం కూడా అక్కడే చేశారు. ఆయనకు మద్దతుగా వచ్చిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
ఈ పరిణామాలపై జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. కేతిరెడ్డికి కోర్టు ఆర్డర్ ఉన్నా, ఆయన బాధితులు మాత్రం ఊరిలోకి రానివ్వరని అన్నారు. గతంలో పొట్టి రవి విషయంలోనూ కోర్టు ఆదేశాలున్నా పెద్దారెడ్డే పోలీసులను అడ్డం పెట్టుకుని అడ్డుకున్నారని జేసీ ఆరోపించారు. తాము కోర్టును గౌరవిస్తామని, కానీ ప్రజలు మాత్రం పెద్దారెడ్డిని అడ్డుకోవడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.
ముందుజాగ్రత్త చర్యగా తాడిపత్రి సరిహద్దుల్లో 750 మందికి పైగా పోలీసులను మోహరించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి రోడ్డుపైనే నిరీక్షిస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.