కరీంనగర్ జిల్లా: కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాలులో బుధవారం కరీంనగర్ పోలీసు కమీషనర్ గౌష్ ఆలం నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్, పోలీసు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం సమీక్షించారు.
రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని, జిల్లాలో శాంతిభద్రతల పర్యవేక్షణపై కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
విగ్రహాల ప్రతిష్ఠాపన నుండి నిమజ్జనం వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. నిమజ్జనం జరిగే ప్రాంతాలను ముందుగానే గుర్తించి, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించాలని తెలిపారు. ఉత్సవ కమిటీలతో సమన్వయం చేసుకుంటూ, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
కమీషనరేట్ వ్యాప్తంగా శాంతి మరియు సంక్షేమ కమిటీలతో సమావేశాలు నిర్వహించాలన్నారు.
పిటిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను సరైన పద్ధతిలో అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానిక సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లను తరచూ సందర్శిస్తూ సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలని సూచించారు. డివిజన్ల వారీగా ఏసీపీ అధికారులు ప్రతి నెలా నేర సమీక్షలు నిర్వహించాలని తెలిపారు. సీసీసీ ద్వారా వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యతనిచ్చి త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. ఆకస్మికంగా తలెత్తే శాంతిభద్రతల సమస్యలను ఎదుర్కొనేందుకు సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా వుంటూ బారికేడ్ లు , లాఠీలు, హెల్మెట్‌లు వంటివి సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు.
ఎస్ హెచ్ ఓలుగా విధులు నిర్వహిస్తున్న ఎస్సై మరియు ఇన్‌స్పెక్టర్ అధికారులు పోలీస్ స్టేషన్ మేనేజ్‌మెంట్‌ను సక్రమంగా నిర్వహించాలని, పోలీస్ స్టేషన్ మరియు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. రికార్డుల నిర్వహణ సరైన పద్ధతిలో ఉండాలని, నమోదైన కేసుల వివరాలు సీసీటీఎన్ఎస్‌లో నమోదు చేయాలని సూచించారు. పెండింగ్ కేసులపై సమీక్ష నిర్వహించి, వాటికి గల కారణాలను తెలుసుకుని త్వరగా పూర్తి చేయాలని అన్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో స్వాధీనం చేసుకున్న వాహనాలను రికార్డుల్లో నమోదు చేయాలని, వదిలివేయబడిన వాహనాలను వేలం వేసేందుకు పై అధికారులకు తెలియజేయాలని చెప్పారు.
రికార్డు నిర్వహణ, సీసీటీఎన్ఎస్, రిసెప్షన్, కోర్టు డ్యూటీ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, బీట్, పెట్రోలింగ్, పాయింట్ బుక్‌ల ఏర్పాటు, సమన్ల జారీ వంటి విధులను సమర్థవంతంగా నిర్వహించాలని పోలీస్ సిబ్బందికి సూచించారు.
డివిజన్‌ను సెక్టార్లుగా విభజించి, ప్రతి సెక్టార్‌కు ఏఎస్సై లేదా హెడ్ కానిస్టేబుల్‌ను ఇంచార్జ్‌గా నియమించాలని, తిరిగి సెక్టార్‌లను రెండు మూడు గ్రామాలతో కలిపి సబ్-సెక్టార్లుగా విభజించి వాటికి పోలీస్ కానిస్టేబుళ్లను కేటాయించాలని ఆదేశించారు. దీని ద్వారా క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకోవడంతోపాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమని తెలిపారు.
రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని, వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలని, ప్రతి నెలా వారికి సంబంధించిన కొత్త సమాచారం సేకరించి నమోదు చేసుకోవాలని అన్నారు.
గంజాయి రవాణా, అక్రమ ఇసుక రవాణా, పి.డి.ఎస్. బియ్యం అక్రమ రవాణా, పేకాట స్థావరాలను గుర్తించి వాటిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. గంజాయి నిర్మూలనలో భాగంగా స్థానిక పాఠశాలలు, కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
సైబర్ నేరాల సంఖ్య పెరుగుతున్నందున ప్రజల్లో వాటిపై అవగాహన పెంచాలని, పెండింగ్ వారెంట్లను అమలు చేయాలని ఆదేశించారు.
రోడ్డు ప్రమాదాలపై చర్చించి, తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్ గా గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు పోలీసులు తీసుకుంటున్న చర్యలను కరీంనగర్ కమీషనరేట్ నందు అవలంభించాలన్నారు.
కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుచేయడం వలన నేరాలు చేదన, అదుపు చేయగలమన్నారు.
ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ (ఏ. ఆర్.) భీంరావు, ఏసీపీలు, వెంకటస్వామి (టౌన్), హుజురాబాద్ ఏసీపీ వి మాధవి , యాదగిరి స్వామి (ట్రాఫిక్), శ్రీనివాస్ (ఎస్బి), వేణుగోపాల్ (సీటీసీ), సతీష్ , విజయకుమార్ (రూరల్), శ్రీనివాస్ జి (సీసీఆర్బి), నర్సింహులు (సీసీఎస్) లతో పాటు కమీషనరేట్‌లోని అన్ని విభాగాల, పోలీస్ స్టేషన్ల, సర్కిల్‌లకు చెందిన ఇన్‌స్పెక్టర్లు, హెడ్ క్వార్టర్స్ లోని అన్ని విభాగాల రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ఎస్.హెచ్.ఓ. లు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.