కరీంనగర్ జిల్లా: కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఐపీఎస్ సోమవారం నాడు కమిషనరేట్ కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాలులో బ్లూ కోల్ట్స్ కానిస్టేబుల్స్‌తో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుండి డయల్ 100 ద్వారా వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు.
పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ బ్లూ కోల్ట్స్ కానిస్టేబుల్స్ వారి వారి పరిధిలోని పాయింట్ బుక్‌లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని సూచించారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల మరియు సంఘవిద్రోహవ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలని, వారి సమాచారాన్ని నమోదు చేసుకోవాలని తెలిపారు.
రాబోయే వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన బ్లూ కోల్ట్స్ కానిస్టేబుల్స్‌కు సూచించారు. గణేష్ మండపాల నిర్వాహకులకు పోలీసులు సూచించిన నిబంధనలు పాటించాలని తెలియజేయాలన్నారు. ( ప్రతి మండపంలో కనీసం ఒక్క కెమెరా ) తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించుకునేలా చూడాలని సూచించారు.
ఈ సందర్బంగా పోలీస్ కమీషనరేట్ తరపున 50 సీసీ కెమెరాలను కొనుగోలు చేశామని, మరో 50 కెమెరాలను కొనుగోలు చేయనున్నామని, వాటిని ముఖ్య కూడళ్లు, సున్నితమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ కెమెరాలను అమర్చడం, జియో టాగింగ్ చేయడం, అవసరమైనప్పుడు ఫుటేజ్ సేకరించడం వంటి విషయాలపై బ్లూ కోల్ట్స్ అధికారులకు శిక్షణ ఇచ్చామని సీపీ తెలిపారు. శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకునేలా చూడాలని ఆయన పోలీసులకు సూచించారు.
ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీ సీసీఆర్బీ శ్రీనివాస్ జి, ఇన్‌స్పెక్టర్లు సరిలాల్, వెంకటేష్ లు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.