పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం మండలంలోని ఏకలవ్య రెసిడెన్షియల్ మోడల్ స్కూల్ అండ్ హాస్టల్‌లో మన్యం జిల్లా పోలీసులు డ్రగ్స్ నిర్మూలన, మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు, యువతకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మహిళల భద్రత కోసం జిల్లా వ్యాప్తంగా శక్తి టీమ్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ టీమ్‌లు పాఠశాలలు, కళాశాలలు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు వంటి రద్దీ ప్రదేశాలలో ఈవ్ టీజింగ్, సైబర్ క్రైమ్, ఫోక్సో చట్టం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తాయని వివరించారు. నోడల్ అధికారి అంకిత సురియెన మాట్లాడుతూ, మహిళలు తమ భద్రతకు సంబంధించి ఎదుర్కొనే ఏ సమస్యకైనా తక్షణమే పరిష్కారం లభించేలా శక్తి యాప్ ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ యాప్‌ను ప్రతి విద్యార్థిని తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ఇందులో ఉండే 11 ప్రత్యేక ఫీచర్ల గురించి వివరించారు. ఏదైనా ఇబ్బంది ఎదురైనప్పుడు భయపడకుండా, ధైర్యంగా శక్తి యాప్ టోల్ ఫ్రీ నెంబర్ 112 లేదా వాట్సాప్ నెంబర్ 7993485111కి కాల్ చేసి సహాయం పొందవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ లంక శ్రీనివాసరావు, డబ్ల్యూపీసీ నిర్మల పాల్గొన్నారు.
